అశ్వారావుపేట/ ఇల్లెందు, జూలై 30 : ఓవైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు మరోవైపు యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంటకు మూడు విడతల్లో రైతుకు అవసరమైన యూరియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విడతకు కనీసం 20 రోజుల వ్యవధి ఉండాలని కఠిన నిబంధన విధించింది. దీంతో పంటల సాగులో అన్నదాతలు అడుగడుగునా అష్టకష్టాలు పడుతున్నారు. ఇక కౌలు రైతుల దుస్థితి మరింత దయనీయం. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6.09 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇందుకు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసింది.
ఇప్పుడిప్పుడే జల్లులు పడుతుండడంతో సాగు పనులు ముమ్మరం చేసిన రైతులను.. ప్రభుత్వం తెచ్చిన యూరియా బుకింగ్ యాప్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత బుకింగ్ విధానం.. రైతులకు శాపంగా మారింది. రైతుకు ఎంతో అవసరమైన యూరియాను మూడు విడతల్లో అందించాలని బుకింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా అందిస్తోంది.
2 ఎకరాల్లోపు రైతులు ఒకే విడతలో యూరియా బుక్ చేసుకోవచ్చు. 2 ఎకరాలకు పైబడిన రైతులు 50-50 నిష్పత్తిలో రెండు విడతల్లో; 5 ఎకరాలకు పైబడిన రైతులు 40-30-30 నిష్పత్తిలో మూడు విడతల్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రతి విడతకూ మధ్య కనీసం 20 రోజుల వ్యవధి ఉండాలన్నది ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధన. ఈ గ్యాప్ వల్ల పంటకు సరైన సమయంలో యూరియా అందించలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆచరణలో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ వానకాలం పంటల సాగు కోసం భద్రాద్రి జిల్లాకు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 9.06 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ప్రకారం ఏ ఎరువులు ఎన్ని టన్నులు అవసరమో ప్రణాళిక రూపొందించారు. అయితే, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకుండా పంటల సాగు విస్తీర్ణం తగ్గుతుందని, తదనుగుణంగా యూరియా విక్రయాలు తక్కువగా ఉండొచ్చని వ్యవసాయ శాఖాధికారులు భావిస్తున్నారు.
ఇక కౌలు రైతుల దుస్థితి మరింత దయనీయంగా ఉంది. వీరికి నేరుగా యూరియా పంపిణీ చేసే అవకాశం లేదు. ఇందుకు భూమి యజమాని పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ఒక పక్క పంటల సాగు చేసుకుంటూనే.. మరో పక్క భూ యజమాని పట్టా తీసుకొని యూరియా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కౌలు రైతుల కష్టాలు రెండింతలవుతున్నాయి. భూ యజమాని అందుబాటులో లేకుంటే ఆయన వచ్చే వరకు ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా నేరుగా యూరియా పంపిణీ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
యాప్‌పై అవగాహన లేని గ్రామీణ రైతులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రైతుల్లో ఎక్కువమంది చిన్న,సన్నకారు రైతులు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. పైగా, నెట్వర్క్ సిగ్నల్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. నిరక్షరాస్యులు కూడా ఎక్కువే. వీరికి యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుకింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటోంది. దీంతో సొసైటీలకు పరుగులు తీసి అక్కడ సిబ్బంది బతిమాలుకొని యూరియా బుక్ చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ‘మీ సేవా’ కేంద్రాల్లోనూ యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
కానీ, అవి మండల కేంద్రంలోగానీ, ప్రధాన గ్రామాల్లోగానీ ఒకటో రెండో మాత్రమే ఉంటున్నాయి. మిగతా గ్రామాల రైతులంతా తమ వ్యవసాయ పనులు పక్కనబెట్టి మీ సేవా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. పంటకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకున్నా, నిర్ణీత సమయంలో యూరియా అందించకున్నా దిగుబడిపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అయితే, యూరియా కొరత, అక్రమాల నివారణకే యాప్ తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో యూరియా పంపిణీ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు. రైతులందరికీ సరిపోయేంత స్టాక్ ఉంది. యాప్ బుకింగ్‌లో ఇబ్బందులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలి. యాప్‌పై అవగాహన కోసంగానీ, బుకింగ్ కోసంగానీ వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే వారు బుక్ చేస్తారు. లేదంటే మీ సేవా కేంద్రాలకు వెళ్లయినా బుక్ చేసుకోవచ్చు.
-వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి
యాప్‌లో యూరియాను బుక్ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంది. పైగా, విడతల వారీగా పంపిణీ చేయడం వల్ల యూరియా కోసం రోజులు, వారాల తరబడి రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రతి విడతకు మధ్య వ్యవధి 20 రోజుల నిబంధన పెట్టింది. ఈ నిబంధన మరీ దారుణం.
– పలగాని పుల్లయ్య, రైతు, అన్నపురెడ్డిపల్లి
యూరియాను పాత పద్ధతిలోనే ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయాలి. యూరియా కొరత నుంచి రైతులను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొలంలో పంటలకు సస్యరక్షణ చేపట్టడాన్ని వదిలేసి యూరియా బుకింగ్ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
-బొల్లికొండ చెన్నారావు, రైతు, అశ్వారావుపేట
యారియా బుకింగ్ యాప్ అంతా గందరగోళంగా ఉంది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ ఉండడం లేదు. సిగ్నల్స్ పనిచేయడం లేదు. దీంతో యాప్ ఓపెన్‌కావడం లేదు. దీంతో బుకింగ్‌కు ఇబ్బంది అవుతోంది. దీనికితోడు 20 వ్యవధిలో విడతల వారీగా యూరియా పంపిణీ అంటే రైతుల సహనాన్ని పరీక్షించడమే. స్మార్ట్ఫోన్లు లేకపోయినా ఇబ్బందికరమే. కౌలు రైతులు మరింత కష్టపడాల్సి వస్తోంది.
-సిరసాని రాంబాబు, రైతు, దమ్మపేట
నేను వరి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం 20 రోజులుగా తిరుగుతున్నా. యాప్ ద్వారా బుకింగ్ చేసేందుకు ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం ప్రయత్నం చేస్తున్నా. కానీ, ఒక్క యూరియా కట్ట కూడా బుక్ కాలేదు. అలాగని బయట యూరియా కొనాలంటే ధర నాలుగు రెట్లు అధికంగా ఉంది. ప్రభుత్వం ఈ యాప్‌లను రద్దు చేసి రైతులకు నేరుగా సరిపడా యూరియాను అందించాలి.
– ధర్మపురి వీరబ్రహ్మచారి, రైతు, టేకులపల్లి
నాకు పట్టా భూమి ఉంది. దానిలో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. కానీ, ఈ ఏడాది పంటలకు యూరియా అందడం లేదు. ఇప్పటికే తొలకరిలో వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్నాం.ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఈ అదునుకు యూరియా వేద్దామంటే వెంటనే దొరకడం లేదు. దీని వల్ల పంటలకు సరైన సమయంలో యూరియా వేయలేకపోతున్నాం.
-బుగ్గ పాపయ్య, రొంపేడు, ఇల్లెందు