OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు శుక్రవారం మంచి వినోదాన్ని అందించబోతోంది. సెప్టెంబర్ 25న ఒకే రోజు నాలుగు దక్షిణాది సినిమాలు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. భయానక కథలు, క్రీడా నేపథ్యంలోని పోరాటం, ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఉత్కంఠభరిత కథ.. ఇలా విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వారాంతంలో థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రాలు మరో ఎంపికగా నిలవనున్నాయి. దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయకుమార్, శ్రేయా రాణి రెడ్డి, భాను చందర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జీ5 వేదికగా సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తేన్పదియన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘అంగీకారం’ కూడా సెప్టెంబర్ 25 నుంచే సన్‌నెక్స్ట్‌లో అందుబాటులోకి రానుంది. కోటపాడి జె. రాజేష్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రామా రాజేంద్రన్ తదితరులు నటించారు. ఇక మీరా కతీరవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ భావోద్వేగ చిత్రం ‘హబీబి’. కస్తూరి రాజా, ఈషా ఎం., మాళవిక మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుస్రేయ రాజన్ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తిరునెల్వేలి సమీపంలోని ఓ చేనేత కార్మికుల పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. దాదాపు 40 ఏళ్ల కాలాన్ని కథలో ఆవిష్కరిస్తూ.. కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నాన్ని, మరోవైపు అబూ తాహిర్, నీలోఫర్ మధ్య చిగురించే ప్రేమకథను సమాంతరంగా చూపించినట్లు తెలుస్తోంది.
కన్నడలో తెరకెక్కిన సస్పెన్స్, కుటుంబ భావోద్వేగాల చిత్రం ‘మాంగో పచ్చా’ కూడా సెప్టెంబర్ 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వివేకా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంచిత్ సంజీవ్, కాజల్ కుందర్, మయూర్ పటేల్, ప్రశాంత్ హిరేమఠ్, ఉగ్రం మంజు, హంస నారాయణస్వామి తదితరులు నటించారు. మొత్తంగా సెప్టెంబర్ 25న ఓటీటీలోకి వస్తున్న ఈ నాలుగు సినిమాలు నాలుగు విభిన్నమైన కథాంశాలతో రూపొందాయి. హారర్, క్రీడా నేపథ్యం, ప్రేమ, కుటుంబ సస్పెన్స్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు ఉండటంతో.. తమకు నచ్చిన కథను ఎంచుకుని ఈ వారాంతాన్ని ఓటీటీలో ఆస్వాదించవచ్చు.