ముంబై, జూలై 30: దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్ డిమాండ్ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. ఇది ఆరేండ్ల కనిష్ఠానికి సమానం కావడం గమనార్హం. ఇక నిరుడు ఏప్రిల్-జూన్‌లో 139.7 టన్నులుగా నమోదైనట్టు వివరించింది. గురువారం ‘క్యూ2 2026 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ పేరిట డబ్ల్యూజీసీ నివేదిక విడుదలైంది. ఇందులో బలహీనపడిన సీజనల్ డిమాండ్‌కుతోడు పెరిగిన కస్టమ్స్ సుంకం, అధిక ధరలు, పసిడి కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు కూడా పుత్తడికి ఆదరణను తగ్గించేశాయని డబ్ల్యూజీసీ పేర్కొన్నది. కాగా, మార్కెట్లో ధరలు పెరిగిన నేపథ్యంలో నిరుడుతో పోల్చితే ఈ ఏప్రిల్-జూన్‌లో వినియోగపు పుత్తడి విలువ రూ.1,98,100 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం రూ.1,32,500 కోట్లుగా ఉన్నదని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సచిన జైన్ పీటీఐకి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిమాండ్ 650-750 టన్నులుగా ఉండొచ్చని అంచనా వేశారు.
అంతర్జాతీయం విషయానికొస్తే.. ఈ ఏప్రిల్-జూన్‌లో గోల్డ్ డిమాండ్ 1,269 టన్నులుగా యథాతథంగా ఉన్నది. జనవరి-జూన్‌లో మాత్రం 2 శాతం పెరిగి 2,522 టన్నులుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. దీని విలువ 380 బిలియన్ డాలర్లు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు, కడ్డీలు, నాణేలు 262 టన్నులకు క్షీణించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇతర సంస్థలు తమ పసిడి నిల్వలను 289 టన్నులు పెంచుకున్నాయి. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కూడా వరల్డ్ గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేసిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున పెరిగిన ముడి చమురు ధరలు.. ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్‌ను మార్చేశాయని గుర్తుచేస్తున్నారు. డాలర్ల డిమాండ్‌తో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనట్టు చెప్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దేశీయంగా రికార్డు స్థాయిలో 1,83,000 పలికిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్.. ఇప్పుడు రూ.35,000 తక్కువకే ట్రేడ్ అవుతున్నది చూస్తూనే ఉన్నాం. ఇందుకు కారణం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలేనని మెజారిటీ నిపుణుల విశ్లేషణ.
దేశీయ మార్కెట్లో బంగారం ధర గురువారం పెరిగింది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు బుధవారం ముగింపుతో చూస్తే రూ.1,000 ఎగిసి రూ.1,48,000 తాకింది. అయితే కిలో వెండి ధర మాత్రం రూ.600 క్షీణించి రూ.2,24,700గా ఉన్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి తులం ధర రూ.1,32,300గా ఉన్నది. తాజా ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచడం డాలర్ విలువను దించింది. ఇదే సమయంలో పుత్తడి విలువను పెంచిందని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ 4,071.55 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 58.25 డాలర్లు పలికింది.