హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఇండెంట్లు, ఆర్డర్లు, అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల మళ్లింపును కొనసాగిస్తున్నది. ఎగువన శ్రీశైలం, దిగువన సాగర్ కుడికాలువ ద్వారా అందినకాడికి తరలించుకుపోతున్నది. ఈ ఏడాది ఏకంగా 80% జలాలు వాడుకున్నది. తెలంగాణ మాత్రం ఇప్పటివరకు కనీసం 20% జలాలను కూడా వినియోగించుకోలే దు. ఏపీని అడ్డుకోవాలంటూ రాష్ట్రం లేఖల మీద లేఖలు రాస్తూ బోర్డు ముందు దేబరిస్తున్నది. బోర్డు చోద్యం చూస్తూ.. ఏపీని నిలువరించేందుకు లేదు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఏపీ ఈ ఏడాది నిరంతరాయంగా కృష్ణా జలాలను తరలిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తోపాటు తెలుగుగంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో టీజీపీకి 15 టీ ఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు కలిపి 34 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నా యి.
గతంలో లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే ఏపీ ఇప్పటికే 200 టీఎంసీలకు పైగా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించింది. అవికాకుండా మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా మరో 42 టీఎంసీలను కొల్లగొట్టింది. దిగువన నాగార్జున్‌సాగర్ వద్ద కుడికాలువ, పంప్‌హౌస్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తున్న ది. సాగర్ కుడికాలువ ద్వారా 140 టీఎంసీలను తరలించుకున్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 665 టీఎంసీలకుపైగా కృష్ణా జలాలను వినియోగించుకున్నది.
తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణా జలాల్లో 34% తీసుకోవాల్సిన తెలంగాణ కనీసం ఆ వాటా ను వినియోగించుకోలేదు. ఇప్పటివరకు 20% జలాలను(కేవలం 174 టీఎంసీలు) మాత్రమే వినియోగించుకున్నది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ప్రాజె క్టు ద్వారా కేవలం 22 టీఎంసీలనే మళ్లించింది. జూరాల కింద నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా తదితర అన్ని ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకున్న జలాలు కూడా 35 టీఎంసీలకు మించలేదు. సాగర్ ఎడమకాలువ ద్వారా ఈ ఏడాది అత్యల్పంగా నీటిని వినియోగించుకున్న తెలంగాణ.. ఎడమ కాల్వ ద్వారా 69 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 26, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలను మాత్రమే మళ్లించింది.
ఉమ్మడి రిజర్వాయర్లలో ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు ఉన్న నీటి నిల్వల్లో ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకోవాలో త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుం ది. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ర్టాల ఈఎన్సీల తో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశమై రాష్ర్టాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా నీటి వాటాలను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుద ల చేస్తూ బోర్డు ఆర్డర్ జారీచేస్తుంది. కానీ, ఇప్పటివరకు కమిటీ సమావేశం జరుగలేదు. తెలంగాణ సర్కార్ ఇప్పటికే పలుమార్లు ఇండెంట్‌ను బోర్డుకు సమర్పించింది.
ఏపీ మాత్రం ఇప్పటికీ ఇండెంట్‌ను సమర్పించలేదు. అయినా యథేచ్ఛగా కృష్ణా జలాల తరలింపును కొనసాగిస్తున్నది. దీన్ని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు నా మమాత్రంగా లేఖలు రాయడం తప్ప చేస్తున్నదేమీ లేదు. కాగా, ప్రస్తుతం యాసంగికి నీటి విడుదల ఇంకా పూర్తికాలేదు. మరోవైపు వేసవి సీజన్ కూడా ఉన్నది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటినిల్వ మట్టం ఎండీడీఎల్ స్థాయిలో 173 టీఎంసీలకు పడిపోయింది. ఏపీ ప్రభుత్వం అత్యధిక మొత్తంలో కృష్ణా జలాలను బేసిన్ అవతలి ప్రాం తాలకు తరలిస్తుండటంతో తెలంగాణలో సాగర్ ఆయకట్టుతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ) : కేంద్రం, పొరుగు రాష్ట్రం ఏపీతో చర్చలకు తాము సిద్ధమని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. చుక్కనీటిని వదిలిపెట్టబోమని, నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని మంత్రి చెప్పారు.