నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. కోటి ఎకరాల మాగాణానికి ప్రాణాధారమైన కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఇలాగే కొనసాగింది. ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోస పెడుతున్నది. గోదావరి జలాలను ఏపీ తన్నుకుపోయేలా స్వయంగా తలుపులు తెరుస్తున్నది. కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలెత్తి చూపితే.. ‘మేడిగడ్డను ఎందుకు ఎండబెడుతున్నావు?’ అని ప్రజలు సర్కారును నాలుగు వేళ్లు ఎత్తి చూపుతున్నారు. దీంతో తమ్మిడిహట్టి రాగం అందుకున్నది. దీంతో నిజం నిలకడ మీద బయటికొస్తున్నది.
గతంలో ఏడేండ్లపాటు కేంద్రం-మహారాష్ట్ర-ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తట్టెడు మట్టి తీయలేకపోయినా తమ్మిడిహట్టి తోక పట్టుకొని గోదావరి ఈదలేమని రేవంత్ ప్రభుత్వమే తేల్చిచెప్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించడం సమంజసమేనని పరోక్షంగా అంగీకరిస్తున్నది. మరి, మహారాష్ట్రతో సంప్రదింపులు చేపడుతామని ప్రకటిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు, నీటి లభ్యత, అంచనాలపై ప్రజలకు సహేతుక వివరణ ఇవ్వాల్సిందే! ఎందుకంటే ఇన్నాళ్లూ గట్టు మీద కూర్చుని తెలంగాణకు నీటి గోస తీర్చిన కేసీఆర్‌పై రాళ్లు వేసినంత ఈజీ కాదు.
(గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు సంవత్సరాల పాటు నానా యాగీ చేసి, కోడిగడ్డు మీద ఈకలు పీకిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలకు హనీమూన్ ముగిసినట్టే అని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమంటే రెండు, మూడు తరాలు అనే ఆనవాయితీని తిరగరాసి కేవలం మూడున్నరేండ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. అందుకే తెలంగాణలో గోదావరిజలాల వినియోగం లెక్కలు తీస్తే కాళేశ్వరం ముందు-తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఏనాడూ సాగునీటి ముఖం చూడని వందలాది గ్రామాలు కాళేశ్వర జలాలతో ధాన్యపు సిరులు పండిస్తున్న దృశ్యాలు కండ్ల ముందే ఉన్నాయి. గోరంతను కొండంతలు చేసినట్టు ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగడంపై కాంగ్రెస్ నానా యాగీ చేసింది. చివరికి సమైక్య పాలకుల విష వలయంలో రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరైనదని కమిషన్లతో చెప్పించింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టి బరాజ్‌ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ వేదికగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మిస్తామని, చేవెళ్లకు గోదావరిజలాలను తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా, కాంగ్రెస్ సర్కారు అడుగుల్లో తడబాటు కనిపిస్తున్నది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలకు, తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం ఉందని అనేకసార్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో అనేకసార్లు విదే విషయం వెల్లడించారు. దీంతో మహారాష్ట్రతో మేడిగడ్డపై ఒప్పందం చేసుకున్న సమయంలో నాటి సీఎం కేసీఆర్ సూటిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. 152 మీటర్ల ఎత్తుతో ఉన్న ఒప్పంద పత్రాన్ని తీసుకువస్తే బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్ పోయి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అప్పుడు సవాల్‌ను స్వీకరించకపోగా, కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసే క్రమంలో అనేకసార్లు తమ్మిడిహట్టి బరాజ్ 152 మీటర్ల ఎత్తులో కట్టేందుకు ఆస్కారం ఉన్నదని, అయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని గోబెల్స్‌ను మించి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి 149 మీటర్లకో, 150 మీటర్లకో మహారాష్ట్రను ఒప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే.. 152 మీటర్లకు ఒప్పందం లేనట్టే కదా?, ఉమ్మడి రాష్ట్రంలో ఏడేండ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేయలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడే తమ్మిడిహట్టి బరాజ్ కట్టి 160 టీఎంసీల గోదావరిజలాలను మళ్లించి 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని రైతులు నిలదీస్తున్నారు. ఇప్పుడు బరాజ్‌ను 149, 150 మీటర్లకు పరిమితం చేయాలనుకుంటున్న కాంగ్రెస్.. అప్పట్లో 152 మీటర్లకు ఎందుకు డిజైన్ చేసిందన్నది ప్రధాన ప్రశ్న. 152 మీటర్ల బరాజ్ ఎత్తుకు సరిపోను కాల్వలను ఎందుకు తవ్వినట్లు? ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ సరైనదైతే అయితే ఇప్పుడు ఎందుకు ఎత్తు తగ్గిస్తామని అంటున్నారు? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రతో కొత్తగా సంప్రదింపులు అంటున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఒప్పందం లేకుండానే గుడ్డిగా కాల్వలు తవ్వామని ప్రజల ముందు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించి మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించిందన్నది కాంగ్రెస్ చేసే ప్రధాన ఆరోపణ. ఏకంగా రూ.కోట్లు ఖర్చుచేసి ఘోష్ కమిషన్‌తోనూ ఇదే చెప్పించింది. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉంది. ఇప్పటికీ ఇందులో సగం కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టి ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌కు మళ్లీ జీవం పోస్తామంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 80 టీఎంసీలను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మరి నిజంగా తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌లో పేర్కొన్నట్లు 160 టీఎంసీలు మళ్లించొచ్చు కదా? తద్వారా చేవెళ్లతో పాటు మరిన్ని ప్రాంతాలకు సాగునీటిని ఇవ్వవచ్చు. ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన హక్కులు ఉన్నా, 160 టీఎంసీలు కాకుండా నీటి మళ్లింపును 80 టీఎంసీలకు ఎందుకు కుదిస్తున్నట్లు? అనే అనుమానాలు తయారవుతున్నాయి. దీనికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలోని నీటిపారుదల శాఖనే తమ్మిడిహట్టి ప్రణాళిక తయారు చేసింది. అందులో తమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తు బరాజ్ నిర్మిస్తే 44 టీఎంసీలు, 149 మీటర్లు నిర్మిస్తే 66 టీఎంసీలు, 150 మీటర్లు నిర్మిస్తే 88 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించే సాంకేతిక వెసులుబాటు ఉందని స్పష్టంచేసింది. అంటే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ ప్రకారం 160 టీఎంసీల మళ్లింపు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నదీ ఇదే. ‘152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకరించడం లేదు. అంతకు తక్కువ ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను మళ్లించి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కాదు. అందుకే మేడిగడ్డ దగ్గరకు వెళ్లాం. కేంద్ర జల సంఘం నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. అది తప్పని రెండేడ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లిస్తేనే కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ప్రచారం నిజమని ప్రజలు నమ్ముతారు. లేకపోతే తాము చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. .
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా విలువలపై కాంగ్రెస్ చేసిన, చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌజ్‌లు కాల్వలు, ఇతరత్రా నిర్మాణాలుంటే మేడిగడ్డ-ఎల్లంపల్లి లింకు-1లోని ఒక్క బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు వ్యయం మొత్తం వృథానని తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు తమ్మిడిహట్టి బరాజ్ నుంచి ఎల్లంపల్లికి (లింకు-1) 80 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.35వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. ఈ మేరకు సర్కారు అనుకూల పత్రికలోనూ లీకులు వచ్చాయి. ఇదేదో గంపగుత్తగా వచ్చిన అంచనా వ్యయం కాదు. ఇంజినీర్లు బరాజ్, పంపుహౌజ్, కాల్వలు ఇలా దేనికెంత అవుతాయంటూ రూపొందించిన లైన్ ఎస్టిమేషన్. కచ్చితంగా అది సర్కారు ఇచ్చిన లీకులేననేది బహిరంగ రహస్యం. అందుకే మాజీ మంత్రి హరీశ్‌రావు చారాణా కోడిపిల్లకు బారాణా మసాలా అని ట్వీట్ చేయడంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉలిక్కి పడ్డారు. ఆలూ లేదు… సూలూ లేదు అంటూ కప్పిబుచ్చుతున్నారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి లింకు పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత అని ఈరోజు కాకున్నా రేపయినా బహిరంగ పరచాల్సిందే. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం-ఫలాలను దానితో బేరీజు వేయడం ఖాయం. అందుకే రేవంత్ ప్రభుత్వం తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఖర్చు చేసే ప్రతి పైసా ఎట్ల సహేతుకమో! తెలంగాణ సమాజానికి వివరించాల్సిన అవసరముంది.