హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్తకాదని పార్టీ అధినేత కేసీఆర్.. తనను కలిసిన ప్రజాప్రతినిధులతో పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రజల యోగక్షేమాలే బీఆర్ఎస్ ఎజెండా అని, ఇలాంటి సమయంలో ఓపిక పట్టాలని పేర్కొన్నట్టు సమాచారం. సోమవారం పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, నగర పాలక సంస్థ చైర్మన్లు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్తు, తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, పార్టీలోని అన్నిస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. కాగా, పార్టీని పూర్తిస్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నారని, పార్టీలో అన్నిస్థాయిల శ్రేణులు, వివిధ వర్గాల నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారని కేసీఆర్‌ను కలిసిన నేతలు స్పష్టంచేశారు.
తాము ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారే సమస్యేలేదని, పార్టీ మారేవాళ్లమే అయితే కేసీఆర్‌ను ఎందుకు కలుస్తామని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కుండబద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ మైండ్‌గేమ్ అడుతున్నదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి కృషిచేస్తామని తేల్చిచెప్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రాంరెడ్డి, భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందమ్ చక్రపాణి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, పలువురు కౌన్సిలర్లు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
పార్టీ నుంచి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరటం తమకు బాధ కలిగించిందని కేసీఆర్ వద్ద పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారని, ఆ సందర్భంలో ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని చెప్పి, బీఆర్ఎస్ ఆవిర్భవం నుంచి ఎదురైన అనుభవాలను వారికి కేసీఆర్ వివరించినట్టు సమాచారం. కాగా, అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.