హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): బడేభాయ్ చోటేభాయ్ కుమ్మకయ్యారా? అందుకే రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్ చిత్రాన్ని తొలగిస్తున్నారా? అని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ నిలదీశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిహ్నాలను మారుస్తూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చార్మినార్, కాకతీయ కళాతోర ణం బొమ్మలను రాజముద్ర నుంచి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ శాంతికి, గంగజమునా తెహజీబ్‌కు ప్రతీకగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని రేవంత్‌రెడ్డికి అమరవీరులకు నివాళ్లు అర్పించే నైతిక అర్హత లేదని చెప్పారు.
కొత్త చిహ్నాలతో తెలంగాణ చరిత్రను మాయం చేయాలని చేస్తున్నారని తెలిపారు. చిహ్నాల మార్పు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల వివాదం కాదని, తెలంగాణ ప్రజల అస్తిత్వమని పేర్కొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వంపై సీమాంధ్ర కుట్రలో సీఎం భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా చేసిన కోదండరాం దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. చిహ్నం మార్పుపై ఒవైసీ స్పందించాలని డిమాండ్ చేశారు. కోదండరాం లాంటి వాళ్లు పకనే ఉండి రేవం త్ చర్యలను సమర్థించడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, రూప్సింగ్,శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.