TGSRTC | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ‘వద్దు బాబోయ్ మాకీ ఉద్యోగాలు.. మేం ఒత్తిడితో కుంగిపోతున్నాం’ అంటూ టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి నరకం చూస్తున్నామని వారు వాపోతున్నారు. సరైన కారణం లేకుండానే మెమోలు జారీ చేస్తూ, సస్పెండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. యాజమాన్యం అనవసరమైన కారణాలతో తమను వేధిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 417 మంది డ్రైవర్లు, కండక్టర్లు సస్పెండ్ అయ్యారు. మరికొందరికి మెమోలు జారీ చేశారు. ఉచిత బస్సు పథకానికి టికెట్ జారీచేయాలంటే ఆధార్ కార్డ్ నంబర్ తప్పనిసరి. మహాలక్ష్మి పథకం కారణంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయని, ఈ క్రమంలో టికెట్ జారీ చేయడం సవాల్ మారిందని కండక్టర్లు చెప్తున్నారు. రాత్రిపూట విధి నిర్వహణ తమకు నరకం కన్నా ఘోరంగా ఉన్నదని ఆ మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. పనిభారాన్ని తట్టుకోలేక శారీరక, మానసిక రుగ్మతలకు గురై దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫ్ డ్యూటీ స్థానంలో సింగిల్ క్రూతో 14 నుంచి 16 గంటలు డ్యూటీలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చామని యూనియన్ నాయకుడొకరు వెల్లడించారు.
రాష్ట్రంలో 41 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పనిభారాన్ని మోస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరైంది కాదని పలువురు కార్మికులు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత బస్సు పథకం అమలుకు ముందవరకు ప్రతిరోజు దాదాపు 2,600 బస్సుల్లో సగటున 11 లక్షల మంది ప్రయాణించేవారు. వీరిలో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవారు. మహాలక్ష్మి పథకంఅందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సగటున 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 17 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. ప్రయాణికులకు తగిన రీతిలో బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో రద్దీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలో టికెట్లు జారీ చేయడం, ఆధార్ నంబర్లను సేకరించడం కత్తిమీద సాములాంటిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో నగరంలో రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. వేల సంఖ్యలో చిన్న, పెద్ద వాహనాల నడుమ, బస్స్టాప్లు, ట్రాఫిక్ సిగ్నళ్లను అధిగమిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్లకు కూడా కత్తిమీద సాము వంటిదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత చేస్తున్నా.. చిన్నచిన్న కారణాలకు వాళ్లను సస్పెండ్ చేస్తున్నారని వాపోతున్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం ప్రక్రియను పూర్తి చేసి, రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీజీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని నమ్మించారు. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణకు అనుమతిస్తామని కూడా మాటిచ్చారు. ఇప్పుడు ఈ హామీలన్నీ రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చినట్టు అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. సమ్మె నోటీసులు ఇచ్చాం. స్పందించకపోతే సమ్మెకు దిగుతాం.