హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్లో ప్రసాదం బుకింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఈడీలు మునిశేఖర్, వెంకన్న, సీటీఎం శ్రీధర్, ఏటీఎం రాజన్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ మేడారంలో తల్లులను దర్శించుకునే భక్తులు బంగారం సమర్పించుకోవడం ఆనవాయితని, పలు కారణాలతో జాతరకు వెళ్లలేని భక్తులకు బంగారం ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. దేవాదాయ శాఖ సహకారంతో అమ్మవార్ల ప్రసాదం, తల్లుల ఫొటో సహా బెల్లం, పసుపు, కుంకుమ అందజేస్తామని తెలిపారు. ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు రూ.299 చెల్లించి www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో, లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చని, మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని ఎండీ వివరించారు.