TGSRTC | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తుంటారు. టికెట్ ఇచ్చే డ్రైవర్గానీ, కండక్టర్‌గానీ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడు తీసుకోవాలని సూచించారు. ఒక్కోసారి ప్రయాణికులు చిల్లర డబ్బులు తీసుకోవడం మర్చిపోతుంటారు. ప్రస్తుతం డిపోకు వెళ్తే చిల్లర డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.
కానీ కొద్దిపాటి చిల్లర కోసం శ్రమకోర్చి అంతదూరం ఏం వెళ్తాంలే అని చాలామంది వదిలేస్తారు. ఇకపై చిల్లర మర్చిపోయినా చింతించాల్సిన పనిలేదని ఆర్టీసీ తెలిపింది. 040-69440000 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు చెప్తే, రావాల్సిన చిల్లరను ఫోన్‌పే ద్వారా పంపిస్తామని వెల్లడించింది. బస్సులో ఏవైనా వస్తువులు మర్చిపోతే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టంచేసింది.
దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు, కొందరు బస్ మిస్సవుతుంటారు. అలాంటి సమయంలో టికెట్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే.. అదే టికెట్‌తో మరో బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.