TGSRTC | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. కాగా, ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణ భాస్కర్‌తో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ప్రభుత్వంతో చర్చల అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరామని చెప్పారు. కారుణ్య నియామకాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలపై సానుకూలంగా స్పందించారని.. వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కూడా సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.