TGPSC | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంచేశారు. ఏ పుస్తకం ప్రామాణికమో చెప్పకూడదని తెలిపారు. జాబ్ క్యాలెండర్ జాప్యంకావడంపై అధ్యయనం చేస్తామని, ఈ అంశంపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో ఏమున్నాయో చూసి, రిజర్వేషన్ల వల్ల ఆగిందా..? లేక మరేమైన కారణాలున్నాయా..? అన్నది స్టడీ చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అమలుచేయడంలేదన్న వార్తలొచ్చాయి. దీంతోనే గత అక్టోబర్లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకాలేదు.
జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బుర్రా వెంకటేశం పై విధంగా స్పందించారు. 18, 19న ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో భేటీ కానున్నట్టు పేర్కొన్నారు. జనవరిలో రాష్ట్రప్రభుత్వంతో భేటీ అయ్యి నివేదికను అందజేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత సంస్థాగత మార్పులు చేసి యూపీఎస్సీతో పోటీ పడేలా కమిషన్ను సిద్ధంచేస్తామని తెలిపారు.