దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్‌టికెట్ తీయుండ్రని అధికారులను అడిగితే ఆయనకో కోచింగ్ సెంటర్ ఉన్నది. రెండు నెలలు డీఎస్సీ వాయిదా వేస్తే వందల కోట్ల లాభం వస్తుండె.. 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారన్న అక్కసుతోనే దీక్షచేస్తున్నడని చెప్పిండ్రు. ఇంకొకాయన మొన్నటిదాక మన పార్టీలోనే ఉన్నాడు కదా? పార్టీలో పదవులేం ఇవ్వకపోవడం వల్ల దీక్షకు కూర్చున్నడని తెలిసింది. ఇంకో పిలగాడు దీక్షల కూర్చుండి గాంధీ దవాఖాన్ల చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్షరాస్తుండు.. మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరా తీస్తే ఓ లీడర్ దీక్షచేస్తే బాగా పేరొస్తదని చెబితే దీక్షల కూర్చున్నడట.
– జేఎన్టీయూలో ముఖాముఖిలో రేవంత్
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : కొన్ని రాజకీయశక్తులు, కొచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మాత్రమే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాయని, తాము సకాలంలో పరీక్షలు నిర్వహిస్తే రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నష్టం జరుగుతుందని, అందుకే వాళ్లు పరీక్షల వాయిదా కోరుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే తాము ప్రజాప్రతినిధులుగా విఫలమైనట్టేనని పేర్కొన్నారు.
పరీక్షలు సకాలంలో పూర్తయితే ఉద్యోగాలు రాని వారు వేరే జాబ్స్ చూసుకుంటారని, అందుకే తాము పరీక్షలు వాయిదా వేయడం లేదని స్పష్టంచేశారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ‘క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్’ అంశంపై శనివారం నిర్వహించిన ముఖాముఖిలో సీఎం ప్రసంగించారు. పదేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, తామిప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటున్నారని చెప్పారు. నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రకారమే గ్రూప్-1లో 1:50 నిష్పత్తి అమలు చేస్తున్నామని, 1:100 నిష్పత్తిపై తమకేం అభ్యంతరం లేదని, కోర్టుకెళ్తే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదముందని తెలిపారు.
డిసెంబర్ 9లోపు ఉద్యోగాల భర్తీ..
ఈ అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం ప్రకటించారు. ఏటా మార్చి 31లోగా అన్నిశాఖల్లో ఖాళీలు సేకరించి, జూన్ 2 లోపు నోటిఫికేషన్లు జారీచేసి, డిసెంబర్ 9లోపు భర్తీ చేస్తామని వివరించారు. గ్రూప్ 1, 2,3, డీఎస్సీ పరీక్షలు పూర్తిచేసి ఈ ఏడాదిలోగా ఉద్యోగాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్‌కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక 90 రోజుల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పునరుద్ఘాటించారు. రాజకీయాలు, తీవ్ర సమస్యల కారణంగానే ఈ ఆరు నెలల్లో విద్యారంగంపై దృష్టి సారించలేదని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ
ఇంజినీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తిచేసే కర్మాగారాలుగా మారరాదని, ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంచాలని సీఎం కోరారు. ఇంజినీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్సేకాదని, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కూడా నడపాల్సిందేనని సూచించారు. యువత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో రూ. 2400 కోట్లు వెచ్చించి ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా మారుస్తున్నామని తెలిపారు.
సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాలి
సమాజంలో పెడదోరణులకు టెక్నాలజీ కూడా కారణమని, పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ నేర్పించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూలో నిర్వహించిన స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్ సిస్టంను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
200 ఎకరాల్లో ‘ఏఐ’సీటీ : శ్రీధర్‌బాబు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని జీహెచ్ఎంసీలో 200 ఎకరాలల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. జేఎన్టీయూ కాలేజీ ద్వారానే ఇంజినీరింగ్ విద్యలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఏఐకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి తాము సెప్టెంబర్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఐటీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌రంజన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి, ఇంటర్ విద్యా కమిషనర్ శృత ఓఝా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం, పోలీసు ఉన్నతాధికారులు సుధీర్‌బాబు, అవినాశ్ మహంతి పాల్గొన్నారు. సెప్టెంబర్‌లో నిర్వహించే ఏఐ సమ్మిట్ పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వన్ టైం సెటిల్మెంట్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై యాజమాన్యాలు వన్‌టైం సెటిల్మెంట్లాంటి ప్రతిపాదనతో వస్తే పరిష్కరిస్తామని రేవంత్ చెప్పారు. ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
రేవంత్ నోట.. అబద్ధపు మాట
డీఎస్సీ నోటిఫికేషన్ రెండేండ్ల కింద జారీచేశారని సీఎం రేవంత్ అబద్ధమాడారు. అభ్యర్థులు రెండేండ్లుగా డీఎస్సీ కోసం ప్రిపేరతున్నారని, రెండేండ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో వారిలో అశాంతి నెలకొందని చెప్పి తన వాఖ్యలను సమర్థించుకున్నారు. ‘పదేండ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు. రెండేండ్ల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. మేం నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కోరుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాసా గత కేసీఆర్ ప్రభుత్వం 6, 612 పోస్టులతో 2023 ఆగస్టు 24న డీఎస్సీ ప్రకటించింది. 2023 సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ తర్వాత నోటిఫికేషన్‌ను రేవంత్‌రెడ్డి సర్కారు రద్దుచేసి, ఈ ఏడాది ఫిబ్రవరి 29న 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ సీఎం రేవంత్ మాత్రం రెండేండ్ల క్రితం నోటిఫికేషన్ జారీచేశారని నోరుజారారు.