హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కంపెనీలన్నీ తమ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని ఆ ప్రకటనలో అధికారులు ఆదేశించారు. నిబంధనలు పాటించని మరికొన్ని కంపెనీలకు నోటీసులు జారీచేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, తెలుపు క్యాటగిరీల కింద మొత్తం 12,264 పరిశ్రమలు ఉన్నట్టు టీజీపీసీబీ అధికారులు తెలిపారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా 2,069 పరిశ్రమల్లో కాలుష్య కారకాలను సమీక్షించినట్టు పేర్కొన్నారు. ఇందులో నిబంధనలు అతిక్రమించిన 1,234 పరిశ్రమలకు నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. 697 పరిశ్రమలు పీసీబీ రూల్స్ పాటిస్తుండటంతో మూసివేత రద్దు ఉత్తర్వులు జారీచేసినట్టు స్పష్టంచేశారు. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, కాలుష్య కారకాలను గుర్తించడానికి 24/7 ఆన్లైన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
501 అత్యంత కాలుష్య కారక పరిశ్రమల నుంచి ఉద్గారాలు, కాలుష్య కారకాలను ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఉద్గారాలు, కాలుష్య కారకాల నిబంధనలను అధిగమించినందుకు టాస్ఫోర్స్ కమిటీ మొత్తం 108 పరిశ్రమలను సమీక్షించి నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదుల సత్వర పరిషారం కోసం టీజీపీసీబీ టోల్-ఫ్రీ నంబర్ 10741, ఆన్లైన్ ఫిర్యాదు యాప్ ‘జనవాణి-కాలుష్య నివారిణి’ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు.