Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఇసుక బజార్లు… రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి. క్వారీల నుంచి నేరుగా ఇసుక బజార్లకు తరలించి ప్రభుత్వమే ప్రజలకు విక్రయిస్తుందంటూ ఏర్పాటు చేసిన ఈ బజార్ల ద్వారా నిర్మాణదారులకు ఇసుక సరసమైన ధరలకు లభించకపోగా… మునుపు దళారులకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ఆర్థిక భారం పడుతున్నది.
దీనికితోడు మూసీ నుంచి తెచ్చిన ఇసుక కూడా ఇక్కడ దర్శనమిస్తుండటంతో నిర్మాణదారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు రవాణాదారులు అధికారులతో కుమ్మక్కై మరో కొత్త రకం ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టారు. గిరాకీ లేక ఇసుక బజార్లలో గుట్టలుగా నిల్వలు పేరుకుపోయినా… ఈ బజార్ల పేరిట నిత్యం లారీలకొద్దీ ఇసుక మాత్రం క్వారీల నుంచి తరలివెళుతున్నది. ఇసుక బజార్ల పేరిట తీసుకువస్తున్న నిల్వలను దారి మళ్లించి బ్లాకులో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అందునా ఓవర్‌లోడ్ కూడా తోడవటంతో సర్కారు ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతున్నది.
ఇసుక బజార్లకు తరలాల్సిన ఇసుక పక్కదారి పడుతున్నది. అధికారులు, రవాణాదారులు కుమ్మక్కై క్వారీల నుంచి ఉచితంగా తరలిస్తున్న ఇసుకను నిర్మాణదారులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు, అమ్యామ్యాలు దండుకుంటూ ఓవర్ లోడింగ్‌కు కూడా అనుమతిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా.. ఆశించిన మార్పు రావడం లేదు. కొద్దిరోజుల క్రితం ఇసుక సంస్కరణల పేరుతో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటూ జేబులు నింపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక అక్రమాలను అరికట్టే పేరుతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) గత మార్చి 16 నుంచి నెలరోజుల వ్యవధిలో అబ్దుల్లాపూర్‌మెట్, బోరంపేట్, వట్టినాగులపల్లి, ఆదిభట్ల తదితర చోట్ల శాండ్ బజార్లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇసుకను క్వారీల నుంచి శాండ్ బజార్లకు తరలించి దొడ్డు ఇసుక టన్నుకు రూ.1600, సన్న ఇసుక టన్నుకు రూ.1800 చొప్పున విక్రయానికి ఉంచారు. జీఎస్టీతోపాటు శాండ్ బజార్ నుంచి ఇంటివరకు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులు కలుపుకుని టన్ను ఇసుక ధర రూ. 2000వరకూ అవుతున్నది. అంతేకాదు, శాండ్ బజార్లలో మూసీ నుంచి తెచ్చిన మట్టి ఇసుకను విక్రయానికి ఉంచడంతో వినియోగదారులు కొనేందుకు ముందుకు రావడంలేదు. దీంతో అన్ని శాండ్ బజార్లలో ఇసుక గుట్టలుగుట్టలుగా పేరుకపోతున్నది.
శాండ్ బజార్లలో ఇసుకను కొనే దిక్కులేకున్నా క్వారీల నుంచి ఇసుక రవాణా మాత్రం ఆగడంలేదు. అసలు ఈ ఇసుక ఎక్కడికి వెళ్తుందని గమనిస్తే… నేరుగా వివిధ ప్రాంతాల్లోని కన్స్ట్రక్షన్ సైట్లకు చేరుతున్నట్టు తేలింది. కొందరు అధికారులు, ఇసుక రవాణాదారులు కుమ్మక్కై శాండ్ బజార్ల పేరుతో ఇసుకను తరలించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. శాండ్ బజార్ల పేరుతో తరలిస్తున్న ఇసుకకు ఎలాంటి వేబిల్లులు ఉండడం లేదు. అంతేకాదు, ఒక్కో లారీలో 50 టన్నుల వరకూ తరలిస్తున్నారు. కొందరు లారీ యజమానులు టీజీఎండీసీ కార్యాలయంలోనే తిష్టవేసి ఈ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ప్రైవేటు మార్కెట్లో విక్రయించే లారీలకు సంబంధించి ఒక్కో లారీకి 30-35 టన్నులకంటే ఎక్కువ అనుమతించేది లేదని గొప్పలు చెప్పిన అధికారులు, ఇప్పుడు అమ్యామ్యాల మత్తులో ఓవర్ లోడింగ్‌ను కూడా అనుమతిస్తున్నారు. క్వారీల వద్ద కాంట్రాక్టర్లు రూ.1000చొప్పున అమ్యామ్యాలు వసూలు చేస్తూ 45-50టన్నుల వరకు లోడింగ్ చేస్తుండగా, కాంటా దగ్గర ఉండే కాపలాదారులు రూ. 500చొప్పున వసూలు చేసి కాంటా పెట్టకుండానే వదిలేస్తున్నారు.
ఇలా ఒక్కో లోడుకు రూ. 1500ఖర్చు చేస్తే 15నుంచి 20 టన్నుల వరకు అక్రమంగా అదనపు ఇసుక తెచ్చుకునే అవకాశం లారీ యజమానులకు కలుగుతున్నది. దీంతో ప్రైవేటుగా విక్రయించే లారీ యజమానులు కూడా ఒక్కో లోడుకు రూ. 1500చొప్పున లంచాలు ఇచ్చుకుంటూ ఓవర్ లోడింగ్ తెచ్చుకుంటున్నారు. ఇలా శాండ్ బజార్ల పేరుతో అధికారులు, ఓవర్ లోడింగ్ ద్వారా లారీల యజమానులు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. సంస్కరణల పేరుతో మూడు నెలలపాటు ఇసుకకు కృత్రిమ కొరతను సృష్టించి టన్ను ఇసుక రూ. 2200-2400వరకూ పెరిగేలా చేసిన అధికారులు.. ఇప్పుడు ఆంక్షలన్నీ గాలికొదిలి స్వలాభం కోసం పాటుపడుతుండడం విమర్శలకు తావిస్తున్నది.