Future City | రంగారెడ్డి, మార్చి 10 ( నమస్తే తెలంగాణ ) : రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యూచర్‌సిటీ కోసం ల్యాండ్‌పూలింగ్ విధానం ద్వారా భూసేకరణ చేపట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, మరో 16 వేల ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. భూసేకరణకు మాత్రం బాధిత గ్రామాల రైతులు ససేమిరా అంటూ ఎక్కడికక్కడే అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్ విధానాన్ని ఎంచుకున్నది. ఈ విధానం ద్వారా టీజీఐఐసీ ఆధ్వర్యంలో రైతుల అంగీకారం తీసుకుని భూములను అభివృద్ధి చేసి 50% ప్రభుత్వానికి, మరో 50% రైతులకు ఇచ్చేలా భూసేకరణ చేపట్టాలని సర్కార్ యోచిస్తున్నది. ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములు ఇవ్వడానికి 80% మంది రైతులు అంగీకరించాల్సి ఉన్నది.
ఫ్యూచర్ సిటీ ప్రకటన నేపథ్యంలో ఈ ప్రాంత భూములకు విపరీతమైన ధరలు పెరిగాయి. దీంతో ల్యాండ్ పూలింగ్‌కు రైతులు ఏ మేరకు సహకరిస్తారన్నది, వారిని ఏమేరకు ఒప్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాం పూలింగ్ విధానంలో 40% ప్రభుత్వానికి, 60% రైతులకు అందజేశారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో 50% కేటాయింపునకు రైతులు ముందుకు వస్తారా? అనేది సమస్యగా మారింది. పూలింగ్ కోసం గ్రామాల్లోని రైతులను ఒప్పించాల్సి ఉన్నది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో రైతుల అంగీకారం తీసుకోవడం కోసం త్వరలోనే టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వ హించాలని సర్కారు నిర్ణయించింది.