ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తాజాగా ప్రకటించారు.
ఈ సారి మూడు మార్పులతో సీట్ల భర్తీ
అన్ని సీట్ల భర్తీలోనూ ఎస్సీ ఉప కులాల వర్గీకరణ
దివ్యాంగుల కోటకు కూడా 5% రిజర్వేషన్
ఇంజినీరింగ్‌లో ఎస్సీ గ్రూప్ -2కు 7,839 సీట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తాజాగా ప్రకటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, లా వంటి కోర్సుల్లో వర్గీకరణను అనుసరించే సీట్లను భర్తీచేస్తామని తెలిపారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ జీవో ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఎప్‌సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలుచేస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు.
ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వేరని, అడ్మిషన్స్‌కు మళ్లీ వేరే నోటిఫికేషన్ ఇస్తామని, అప్పుడు ఉప కులాల వర్గీకరణను నోటిఫికేషన్లో పొందుపరిచే అవకాశముందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో మూడు మార్పులుంటాయి. ఈ మూడు మార్పుల మేరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఉప కులాల వర్గీకరణతో గ్రూప్ -2లోని కులాలకే ఎక్కువ సీట్లు దక్కుతాయి. వీరికి 9శాతం రిజర్వేషన్ ఉండటంతో ఆ మేరకు సీట్లు దక్కుతాయి. ఇంజినీరింగ్‌లో 87వేలకు పైగా కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వీటిలో 15శాతం ఎస్సీలతో భర్తీచేస్తున్నారు. వర్గీకరణలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించడంతో గ్రూప్-2కు 7,839 సీట్లు దక్కుతాయి. ఫార్మసీలో 963, ఎంబీఏ, ఎంసీఏలో 3,204 సీట్ల చొప్పున గ్రూపు-2కి దక్కుతాయి.
ఈ సారి మూడు మార్పులివే
ఇంజినీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈసారి మూడు మార్పులుంటాయి. మొదటిది ఎస్సీ ఉప కులాల వర్గీకరణ. ఈ కోటాలో మూడు గ్రూపులకు సీట్లను కేటాయిస్తారు. మొదటి గ్రూపునకు 1శాతం, రెండో గ్రూపునకు 9, మూడో గ్రూపునకు 5శాతం రిజర్వేషన్ అమలవుతుంది.
నూతన విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయిస్తారు. ఐదు క్యాటగిరీలుగా విభజించి ఐదుశాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు. దృష్టిలోపం – ఏ క్యాటగిరీ, వినికిడిలోపం, మూగ – బీ క్యాటగిరీ, అంగవైకల్యం -సీ క్యాటగిరీ, మానసిక వైకల్యం – డీ, ఒకటికి మించి వైకల్యాలుంటే ఈ-క్యాటగిరీ కింద ఒకశాతం సీట్లను కేటాయిస్తారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేండ్లపాటు విద్యాసంస్థల్లో ప్రవేశాల కోటా గడువు ముగిసింది. గతంలో 85శాతం మనకు, 15శాతం ఏపీ కోటా సీట్లుండగా, కొత్త విద్యాసంవత్సరం నుంచి మొత్తం సీట్లను తెలంగాణ వారితోనే భర్తీచేస్తారు. 95శాతం సీట్లను తెలంగాణ వారికి కేటాయించగా, 5శాతం సీట్లను ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి 10 ఏండ్లపాటు నివాసమున్న వారి పిల్లలు, స్థానికులైన వారి భార్యలు, భర్తలకు కేటాయించారు.