TG Rains | తెలంగాణలో రాగల రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాయలసీమ మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించి ఉందని తెలిపింది. సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని.. ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా గడిచిన 24గంటల్లో రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, యాద్రాద్రి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్తో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబాబాద్ జిల్లా మునిగాలవీడులో 9.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.