KTR | ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. గతంలో కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో కేటీఆర్‌కు సెక్షన్ 409 వర్తించదని, ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరుగలేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాలకు ఆ నిధులను కేటీఆర్ వాడుకోలేదని.. మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఒక్క రూపాయి లబ్ధి పొందలేదని చెప్పారు. కేటీఆర్‌కు 409 అప్లయ్ చేస్తే.. గందరగోళం నెలకొనే అవకాశం ఉందని.. ఇకపై దేశంలో ఏ మంత్రి సైతం ఫైళ్లపై సంతకాలు చేయబోరన్నారు.
అందుకు బాంబే హైకోర్టు నుంచి ఇప్పటి వరకు అన్ని కేసుల ఉదాహారణలను అందజేస్తామని చెప్పారు. అనుమతి తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని చెప్పారు. కేటీఆర్ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారన్నారు. బ్యాంకింగ్ చానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ సంస్థకు వెళ్లాయని.. ఏసీబీ అధికారులు చెబుతున్న రూ.8కోట్లు సైతం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవని.. ఆ డబ్బులన్నీ నిర్వాహకులకు వెళ్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోర్టు బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు నమోదు చేశారని ఏసీబీని ప్రశ్నించింది. 14 నెలల కిందటనే నేరం జరిగిందని.. ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా కోర్టుకు ఏసీబీ తరఫున ఏజీ తెలిపారు. డబ్బు చేరిన వ్యక్తిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని.. ఆ విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించింది. ఎఫ్ఈవో వివరాలను కేటీఆర్ తరఫు న్యయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
రేసు వ్యవహారంలో ఒప్పందం జరుగక ముందే చెల్లింపులు చేశారని.. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46కోట్లు చెల్లించినట్లుగా చెప్పారు. రేసింగ్ వ్యవహారంలో సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసినట్లుగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కేసు విచారణ ఏ దశలో ఉందని కోర్టు ఏజీని ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. విచారణ జరిపితే అన్ని ఆధారాలు బయటపడుతాయని చెప్పారు. ఇప్పటికే ఫిర్యాదుదారుడైన దాన కిశోర్ వాంగ్మూలం నమోదు చేశామని ఏజీ చెప్పారు. నిందితులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? అని ప్రశ్నించింది. అయితే, ఎవరూ పిటిషన్లు దాఖలు చేయలేదని ఏజీ కోర్టుకు వివరించారు.