హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : మెట్రో కొనుగోలు (Hyderabad Metro) వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు నిధుల సర్దుబాటు కోసం దిక్కులు చూస్తున్నది. తక్కువ వడ్డీకి అప్పులు తీసుకొచ్చి, ఎల్అండ్టీ సంస్థకు చెల్లించేందుకు విశ్వప్రయత్రాలు చేస్తున్నది. ఇందుకోసం ఫైనాన్షియల్ ఏజెన్సీల కోసం వెతుకులాడుతున్న రేవంత్ సర్కారు.. అప్పు పుడితే గానీ ఎల్అండ్ టీకి చెల్లించలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదని తెలుస్తున్నది.
అప్పులు ముంచుకొస్తున్నా, నిర్వహణ భారం పెరుగుతున్నా ఎల్అండ్టీ ఇన్నాళ్లూ భరిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్వహణ చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు రాగానే సీన్ మారినట్టుగా నిర్వహణ అసాధ్యమనే స్థాయికి వచ్చిన సంస్థ.. ఇక వీలైనంత త్వరగా నగర మెట్రో నుంచి తప్పుకోవాలనే స్థితికి వచ్చింది. అంతేగాక ప్రభుత్వం పెట్టిన కొర్రీలు కూడా ఆ సంస్థకు మరో తలనొప్పిగా మారాయి. మెట్రో మొదటి దశ నిర్వహణ బాధ్యతలను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వం రూ.13వేల కోట్ల భారం మోయాలి. అంతేగాక సంస్థ పేరిట ఉన్న ఈక్విటీ కోసం మరో రూ.2వేల కోట్లు అదనంగా చెల్లించాలి. ఇవన్నీ కలిపి రూ.15వేల కోట్లు దాటుతుంది. ప్రస్తుతం ఉన్న అప్పులకు ఆ సంస్థ ఏటా రూ.1000 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా.. భవిష్యత్తులో అదే మొత్తాన్ని కాంగ్రెస్ సర్కారు భరించాల్సి ఉంటుంది. కానీ ఖాళీ చేతులతో ముందుకు వెళ్లిందనే అభిప్రాయం నిపుణుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ లెక్కన నిర్వహణ భారం, అప్పు చెల్లింపుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే మున్ముందు మెట్రో ప్రయాణికులపై ధరల పిడుగు పడినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అంత మొత్తం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెబుతూనే.. ఆర్భాటానికి పోయి అప్పుల భారాన్ని ఎలా అంగీకరించారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే దీని నుంచి బయటపడేందుకు ఇప్పటికిప్పుడు అప్పులు ఇచ్చే ఆర్థిక సంస్థల కోసం ప్రభుత్వం వెతుకుతున్నట్టు సమాచారం. తక్కువ వడ్డీ రేటు, ఎక్కువ నిధులిచ్చే సంస్థల కోసం ఏకంగా ఓ కన్సల్టెన్సీని ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది. మెట్రో యంత్రాంగం కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నదనీ, ఇటీవలి ఉన్నతాధికారుల సమీక్షలోనే సీఎం క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వానికి అప్పులు పుడితే గానీ, ఈ ఒప్పందం కొలిక్కి వచ్చే పరిస్థితి లేదనీ, ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన రూ.15వేల కోట్లు నిధులు సర్దుబాటు అయితే గానీ ఈ ఒప్పందం కుదిరేలా లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటులో ఏమైనా లోపాలు జరిగితే కాంగ్రెస్ ఖాతాలో మరో విఫల ప్రయత్నంగా నిలిచిపోనున్నది.