Telangana | హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 10 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో అగ్రగామిగా నిలపాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో వేసిన అభివృద్ధి బీజాలు ఒక్కొక్కటిగా ఫలాలు ఇస్తూనే ఉన్నాయి. వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత దుస్తుల తయారీ పరిశ్రమ ‘కిటెక్స్’ ఇటీవలే 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించగా, ఇప్పుడు తాజాగా సిరిసిల్లలో 1600మందికి ఉపాధి కల్పించనున్న అత్యాధునిక దుస్తుల తయారీ పరిశ్రమ ‘టెక్స్‌పోర్ట్’ ప్రారంభానికి సిద్ధమైంది. పరిశ్రమలశాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో అప్పారెల్ పార్క్ సాకారమైంది. శుక్రవారం ఈ పరిశ్రమను పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
2022లో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బెంగళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందం చేసుకున్నది. ఇందులో భాగంగా కేసీఆర్ సర్కారు సిరిసిల్లలోని పెద్దూ రు అప్పారెల్ పార్లో టెక్స్పోర్ట్కు 7.42ఎకరాల భూమి కేటాయించింది. రూ.62 కోట్లతో 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీజీఐఐసీ బిల్ట్ టు సూట్ యూనిట్‌ను నిర్మించింది. పారిశ్రామిక షెడ్లు, విద్యుత్తు సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రిస్ రూ.40 కోట్లతో యంత్రాలతో పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఇకడ తయారయ్యే దుస్తులను ‘టెక్స్‌పోర్ట్’ వందశాతం ఎగుమతి చేయనున్నది.
సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి నలుగురు మంత్రులు వస్తుండడంతో తమ బతుకులు బాగుపడుతాయన్న ఆశతో నేతన్నలు ఎదరుచూస్తున్నారు. కేసీఆర్ సర్కారు చేయూతతో నిరంతరాయంగా నడిచిన మరచక్రాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిచిపోయాయి. 30మంది వరకు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా లేకపోవడంతో చాలామంది ఉపాధిపై దెబ్బపడింది మంత్రుల పర్యటనలు కేవలం నామమాత్రంగానే ఉంటాయా లేక, సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకమైన చర్యల దిశగా అడుగులు పడుతాయా అని నేతన్నలు ఎదురుచూస్తున్నారు.
మా సమస్యలు చెప్పుకొనేందుకు ఆఫీస్ దూరమైంది. పగార తక్కువ ఇచ్చిండ్రని, త్రిఫ్ట్ పైసలు పడలేదని గిట్ల ప్రతీ సమస్యను దగ్గరున్న సార్లకు ఇన్ని రోజులు చెప్పుకొన్నం. ఉన్న ఆఫీస్ తీసుకుపోయి కలెక్టరేట్లో పెట్టిండ్రు. అంతదూరం వెళ్లి, సమస్యలు చెప్పుకోలేకపోతున్నం. కాంగ్రెస్ సర్కారు వస్తే బతుకులు ఇట్ల ఆగమైతయని అనుకోలేదు.
వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. మరమగ్గాలకు విద్యుత్తు రాయితీలు ఇచ్చింది. క్యాటగిరి 4నుంచి క్యాటగిరి 3కు మార్చడంతో బ్యాక్ బిల్లింగ్ కట్టాలంటూ సెస్ అధికారులు ఒత్తిడి తెస్తున్నరు. కరెంట్ కట్ చేసిండ్రు. అంత మొత్తం కట్టలేము. సాంచాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బ్యాక్ బిల్లింగ్ మొత్తానికి రద్దుచేసి యూనిట్‌కు రూ.2చొప్పున బిల్లులు వేయాలి.
నేతన్నల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ యథావిధిగా అమలు చేయాలి. కార్మికుడినే యజమానిగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రవేశపట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. మహిళా సంఘాల కోసం తయారు చేస్తున్న చీరలకు కూలీ రేట్లు నిర్ణయించాలి.