Municipal Elections | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో మున్సిపాలిటీలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఓ వైపు 128 మున్సిపాలిటీల పాలక మండలి గడువు ఈ నెల 26తో ముగియనుంది. వీటిలో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు ఉన్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ గడువు 28న ముగియనుండగా మరుసటిరోజు నుంచే ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-సీడీఎంఏ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. బీసీల రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
బీసీ రిజర్వేషన్లపై అస్పష్టత
మున్సిపాలిటీల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలాకాలంగా పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది. ముందుగా వాటికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముంది. మరోవైపు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీలు తేల్చిచెబుతున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతే రిజర్వేషన్లపై స్పష్టతరానుంది. ఈ లోగానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? వేచిచూస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
ప్రతికూల పవనాలతో కష్టమే!
ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీలలో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీల నిర్వహణ కూడా గగనంగా మారింది. చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదని ప్రజలు రోడ్డెక్కుతున్న ఉదంతాలే ఇం దుకు నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఎన్నికలకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై గ్రామాలు, పట్టణాల్లో జరిగిన వివిధ సర్వేలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను స్పష్టంచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వెళ్తే భంగపాటు తప్పదని కొందరు కాంగ్రెస్ సీనియర్‌నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు 2026 మే 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సిద్దిపేట, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల గడువు ముగియనుంది.