హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సర్కారు నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. పదో తరగతి ఇంటర్నల్ మార్కుల విషయంలో సర్కారు తీరు పూటకో నిర్ణయం, రోజుకో తీరును తలపిస్తున్నది. చుట్టూ తిరిగి మళ్లీ పాతపద్ధతికే సర్కారు జైకొట్టింది. 20 శాతం ఇంటర్నల్ మార్కులను కొనసాగిస్తామని, 80శాతం మార్కులకే వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులను విడుదల చేశారు. ఇలా నిర్ణయాలు తీసుకోవడం, మళ్లీ మారిపోవడంతో విద్యాశాఖలో అసలేం జరుగుతున్నదనే చర్చ నడుస్తున్నది.
ఇది వరకు పదో తరగతిలో ఒక్కో పేపర్‌కు 80 మార్కులకు వార్షిక పరీక్షలు, 20మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ఈ విధానంలో విద్యాశాఖ మార్పులు చేసింది. 2024 నవంబర్‌లో వార్షిక పరీక్షల్లో గ్రేడింగ్‌ను రద్దు చేయడమే కాకుండా ఇంటర్నల్స్‌ను సర్కారు రద్దుచేసింది. 100 శాతం మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని అప్పట్లో సర్కారు తెలిపింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటికే సగం విద్యా సంవత్సరం గడిచిపోగా, విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ పరీక్షలను సైతం నిర్వహించారు. విద్యార్థులు కూడా 80శాతం మార్కులు ఉంటాయన్న భావనతో వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
విద్యాసంవత్సరం మధ్యలో సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయాన్ని టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తప్పుబట్టాయి. తప్పుదిద్దుకోవడంలో భాగంగా అప్పట్లో ఒకరోజు వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్నారు. ఆ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రేడింగ్ విధానం రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విద్యాసంవత్సరం నుంచే గ్రేడింగ్ ఉండదు. మార్కులనే కేటాయిస్తామని అప్పట్లో స్పష్టంచేశారు. అయితే మళ్లీ ఏమయిందో ఏమో కానీ 2025 ఫలితాల వెల్లడి సమయంలో మళ్లీ నిర్ణయాన్ని మార్చారు. 2024-25 విద్యాసంవత్సరానికి పదో తరగతి మోమోలపై మార్కులతో పాటు గ్రేడ్లను సైతం ముద్రించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మెమోలపై మార్కులతోపాటు, గ్రేడ్లను సైతం ముద్రించారు.
పదో తరగతి పరీక్షలపై మళ్లీ అనుమానాలు తలెత్తడంతో ఈ ఏడాది జూన్‌లో పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఒక్కో పేపర్‌కు 80 మార్కులకు కాకుండా 100 మార్కులకే పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నది. 1-10 వరకు అన్ని తరగతులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని, పదో తరగతి వార్షిక పరీక్షలకు ఎఫ్ఏ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. మళ్లీ తాజాగా సోమవారం ఈ నిర్ణయాన్ని మార్చి.. 100 మార్కులకు బదులు 80 మార్కులకే వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను రద్దుచేయడంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మెట్టికాయలేసింది. సీబీఎస్ఈ పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్స్, 80 శాతం వార్షిక పరీక్షలకు మార్కులు కేటాయిస్తున్నారు. తెలంగాణలో ఎలా ఇంటర్నల్స్‌ను రద్దుచేస్తారని ఇటీవలే నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎన్సీఈఆర్టీ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు. దీంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఆ మేరకు పాత విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.