SSC Exams | హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లు ఏర్పాటుచేశారు. 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. గంటముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, గోడగడియారాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. నీటి సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు సందేహాలుంటే 040-232 30942 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): మార్చి 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు జరిగిన కెమిస్ట్రీ-2, కామర్స్-2 పరీక్షలకు 4,44,697 మంది విద్యార్థులకు 4,31,964 మంది (97.13%) హాజరయ్యారు. ఏప్రిల్ మూడోవారంలో ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.