కరీంనగర్ : కరీనంగర్-నిజమాబాద్-మెదక్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల (MLC election nominations)ఘట్టం చివరిరోజు అయిన సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద స్వల్ప ఘర్షణతో పాటుగా కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి వి. నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి పలువురు మంత్రులతో కలసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అదే సమయంలో.. మాజీ మేయర్ సర్దార్ రవిందర్‌సింగ్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చారు.
ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వాహనంలోనికి వెలుతుండగా.. పోలీసులు అడ్డు చెప్పారు. అక్కడే ఉన్న రవీందర్‌సింగ్ జోక్యం చేసుకొని.. తమ వాహనాలను అనుమతించకుండా.. మంత్రుల వాహనాలను ఎలా కలెక్టరేట్‌లోకి పంపించారంటూ పోలీసులను ప్రశ్నించారు.దీంతో.. కొద్ది సేపు వివాదం సాగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ.. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో పాటుగా ఆయనతో వచ్చిన వ్యక్తులను తోసివేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఫలితంగా కొద్దిసేపు ఉద్రికత్త ఏర్పడి పోలీసులు జోక్యం చేసుకొని.. ఇరువర్గాలను వెళ్లగొట్టాయి. ఈ సందర్భంగా రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. తమకు ఒక్క వాహనాన్ని కూడ లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు మంత్రులకు సంబంధించిన పలు వాహనాలను ఎలా అనుమతించారన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా అన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదుచేస్తామని తెలిపారు.