Congress | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్‌లో మంత్రిపదవుల కోసం కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితిని ఊహించిన అధిష్ఠానం ఇంతకాలం మంత్రివర్గ విస్తరణను జాప్యం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు పచ్చజెండా ఊపగానే పరిస్థితి జటిలంగా మారిందని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలుండగా 36 మంది ఆశావహులు పదవులను ఆశిస్తున్నారని, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్ఠానం పెద్దలు తలలు పట్టుకున్నట్టు ప్రచారం. ఈ ఆరింటిలో ఒక్క దానిపైనే స్పష్టత ఉన్నట్టు, మిగిలిన ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు పార్టీ పెద్దలు ఆపసోపాలు పడుతున్నట్టు తెలిసింది. పోనీ తెగించి ముందుగా అనుకున్నవారికే పదవులు కట్టబెడదామనుకుంటే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమవుతుందేమోనన్న అనుమానం వారిని పీడిస్తున్నట్టు తెలిసింది.
ముదిరాజ్ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కలిపిస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా సూచించినట్టు తెలిసింది. ఈ ఒక్క పేరు విషయంలోనే పార్టీకి క్లారిటీ ఉన్నదని, మిగిలిన వారి విషయంలో పీటముడి వీడటం లేదని అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నేతల వల్లనే సమస్యలు వస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మంత్రిపదవిపై తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అలాగైతే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరికి మంత్రి పదవులు అంటే ఎలా అంటూ పార్టీ డైలమాలో పడ్డదని, ఈ రెండు కుటుంబాల వల్లనే సర్దుబాటు క్లిష్టంగా మారిందని సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తమ కర్చిఫ్లు వేసినట్టు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అందరికంటే తానే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సామాజిక సర్దుబాట్లలో తనకు ఇవ్వటం సాధ్యం కాకపోతే, తాను రాజీనామా చేస్తానని, అధిష్ఠానం సూచించిన సామాజిక వర్గం నేతను నిలబెట్టి గెలిపించుకుంటానని, అప్పుడైనా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.
మరోవైపు ఎస్సీ, ఎస్టీలలో కూడా మంత్రి పదవుల లొల్లి మొదలైంది. వివేక్ వెంకటస్వామి పేరు ఖాయమైనట్టు తెలియడంతో మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. మాలల నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం, స్పీకర్ ఉన్నారని, మళ్లీ వారికే అవకాశమిస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వివేక్ కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారని, ఇక మంత్రి పదవి కూడా వారికే ఇస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈసారి మాదిగ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలె యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు, మందుల సామేల్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
లంబాడ గిరిజన సామాజికవర్గం నుంచి బాలూ నాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండటంతో బాలూనాయక్‌కు రూట్ క్లియర్ చేయడం అధిష్ఠానానికి ఇబ్బందిగా మారిందని ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గంలో తమ వర్గానికి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడ గిరిజన సంఘాలు హైదరాబాద్, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించాయి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, సీనియర్ ఎమ్మెల్యే నెహ్రూ నాయక్ , ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లలో ఒకరికి స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు ఏఐసీసీకి, రేవంత్‌కు వినతిపత్రాలు అందించారు.
క్యాబినెట్ విస్తరణ కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి భారం మొత్తం అధిష్ఠానం మీదనే వేసినట్టు తెలిసింది. అయితే తన పక్షాన సీనియర్ కాంగ్రెస్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరును సూచించినట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. తమకు చెక్ పెట్టడానికే సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా సుదర్శన్‌రెడ్డి పేరును సూచించారని, సీనియర్ కాంగ్రెస్ నేతలు దొంతి మాధవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు గుర్రుగా ఉన్నట్టు పార్టీ సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిని తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. ‘తొలగిస్తే తానేంటో చూపిస్తా’ నని సదరు అమాత్యుడు సవాల్ విసిరినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.