Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో గ్రామంలో ఆదివారం నిర్వహించిన నాలుగు పథకాల మంజూరు పత్రాల అందజేత సభల సాక్షిగా ప్రజాగ్రహం మళ్లీ పెల్లుబికింది. రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లతో లబ్ధిదారుల లిస్ట్‌లు తయారు చేసి, అర్హుల పేర్లు తొలగించారని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. మొన్నటి గ్రామసభల్లో ఎదురైన నిలదీతలు మళ్లీ జరగకుండా అణచివేసేందుకు పోలీసులు భారీగా మోహరించినా అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. మండలానికి ‘ఒక్క’ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్వీకరిస్తాం..సాచురేషన్ పద్ధతిని అమలు చేస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు ప్రకటించినదానికి ఆచరణకు పొంతనలేకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రసాభాసాగా మారాయి. ఫైలట్ గ్రామాలు సైతం సర్కార్‌పై ఫైట్ చేశాయి. మరోవైపు ప్రభుత్వా న్ని నిలదీస్తున్నారనే అక్కసుతో కాంగ్రెస్ శ్రేణు లు ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపాయి. నిలదీసిన వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోగా పోలీసులను ఉసిగొలిపి చితక్కొట్టించిన ఉదంతాలపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ని లదీసిన వారిని ఈడ్చుకెళ్లటం, ప్రశ్నించిన వారిని పోలీసులతో కట్టడి చేయించటంతో అనేకచోట్ల గ్రామసభలు ఉద్రిక్తంగా మారాయి.
ఇందిరమ్మ పాలన అంటే ఇట్లుంటదని కాం గ్రెస్ సర్కార్ మరోసారి నిరూపించే ఘటన జనగామ నియోజకర్గంలో చోటుచేసుకున్నది. ఎర్రకుంట తండాలో జరిగిన గ్రామసభ ఉద్రికత్తతలకు దారితీసింది. అనర్హులకు పథకాలు ఎలా అందజేస్తారని నిలదీసిన పాపానికి బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు రెచ్చిపోయారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే పల్లాపై కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు, టమాటాలు విసిరేశా రు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. పరిస్థితి చేయిదాటిపోతున్నదని గ్రహించిన మంత్రి పొంగులేటి సభను రద్దు చేసుకున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి సభలో భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావుపైకి ఓ కాంగ్రెస్ కార్యకర్త కోడిగుడ్లు విసరడం గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్త బొమ్మకంటి ప్రశాంత్ కోడిగుడ్లు విసిరినట్టు గుర్తించిన పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కోడిగుడ్లు ఎమ్మెల్యే పక్కనుంచి వెళ్లి వెనుకాల ఫ్లెక్సీకి తగిలాయి. ఇందిరమ్మ జాబితాలో పేరు ఉన్నా తనకు ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదన్న అక్కసుతోనే ప్రశాంత్ కోడిగుడ్లు విసిరినట్టు గుర్తించారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం పొ న్నాలలో కాంగ్రెస్‌నేతలతో పాటు అధికారులు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మొదలుకాగానే కాంగ్రెస్ నేతలు తమకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించారు. రామలింగేశ్వరస్వామి ఆలయ మాజీ డైరెక్టర్ వేణుగౌడ్ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులకు కాకుండా కాంగ్రెస్ శ్రేణులకే కేటాయించారని ఆరోపించారు. ఎ లాంటి తప్పులు జరగనప్పుడు జాబితా ఇ చ్చేందుకు ఇబ్బందులు ఎందుకని ప్రశ్నించా రు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు నక్క ప్రభాకర్‌గౌడ్, జీడిపల్లి వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు మరికొందరు కలిసి వేణుగౌడ్ మీదకు అరుస్తూ వెళ్లడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇదేమిటని స్థానికులు అధికారులను అడిగితే స్వయంగా మండల ప్రత్యేకాధికారి శంకర్ కుమార్ ఆగ్రహంగా ’నీకు మైకు ఎవడిచ్చాడురా? ఎందుకిచ్చా రు..? ఆ మైకును లాక్కోండి’ అంటూ వేదికపైనే చిందులు తొక్కారు. దీంతో ప్రజలు అధికారి తీరుపై మండిపడ్డారు. పోలీసులు వచ్చి ప్రశ్నిస్తున్నవారిని బయటకి లాక్కెళ్లారు. సభ వేదికపై సీటు కేటాయించలేదని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్నిలో పథకాలు రానివారు నిలదీశారు. దీంతో అధికారులు ‘నోరు మూస్కొని కూర్చుండాలి. అలా అయితేనే మేము మళ్లీ రాసి పంపుతం’ అని జులుం ప్రదర్శించారు. ప్రింటింగ్ పూర్తిగా కాలేదని కొందరికే పత్రాలు పంపిణీ చేశారు. ఒంటరి మహిళలకు, ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడం, ఒక్కో ఇంట్లో ముగ్గురికి పథకాలు వర్తింపజేయడంతో పలువురు గగ్గోలు పెట్టారు.
‘కేసీఆర్ సారు ఉన్నప్పుడు నాకు పింఛన్ వ చ్చింది. కాంగ్రెస్ పాలనలో రావడం లేదు. నా పింఛన్ ఎందుకు తొలగించిండ్రు’ అని 85 ఏండ్ల రైతు సాయన్న అధికారులను నిలదీశాడు. అంతర్నిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ మాట్లాడుతుండగా సాయన్న వేదిక వద్దకు వచ్చి తనకు పింఛన్ రావడం లేదని నిలదీశాడు. కూర్చోవాలని బతిమాలినా ఆగ్రహంతో ఊగిపోతూ సర్కారుపై తిట్ల వర్షం కురిపించాడు.
‘మాది ఊరు కాదా? మేం అడవిల ఉన్న మా? మా గ్రామానికి చెందిన లబ్ధిదారుల పేర్లు ఎందుకు చదువుతలేరు?’ అని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సాంగ్వీ అనుబంధ గ్రామం మల్లాపూర్ గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హత పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అందిస్తుండగా మల్లాపూర్‌కు చెందిన యువకులు, మహిళలు, రైతులు ‘మా ఊరులో అర్హులు ఒక్కరూ లేరా?.. మేం ఎన్నికలప్పుడే గుర్తుకొస్తమా.. పథకాలకు పనికిరామా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొ ప్పారంలో సీఎం రేవంత్ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు చూపెట్టాల్సి ఉండగా, నెట్ సేవలు లేక అధికారులు అవస్థలు పడాల్సి వచ్చింది. చివరకు చేసేదేమీ లేక సెల్‌ఫోన్ ద్వారా మైకులో వినిపించాల్సి వచ్చింది.
సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ లో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారని అధికారులను నిలదీశారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో చదవకుండా ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను 30 ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తే, తన పేరు లేకుండానే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లిలో ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి సంతకాలు లేకపోవడంతో గ్రామస్తులు నిలదీశారు.
పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో ఎవరి సంత కం లేకుండానే ప్రొసీడింగ్స్ అందించడంతో లబ్ధిదారులు విస్మయానికి గురయ్యారు. పథకాలు తమకు వచ్చినట్టా? రానట్టా? అని ఆలోచనలో పడ్డారు. కమాన్‌పూర్ మండలం రొంపికుంటలో 10 మంది చొప్పున మంజూ రు పత్రాలు అందజేయగా, మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారని గ్రామస్తులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రశ్నించారు. వారితో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపేటలో కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుతో కలిసి మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మహేశ్వర్‌రెడ్డి లబ్ధిదారుల పేర్లను చదువుతూ మంజూరు పత్రాలు అందజేయగా, మూడు రోజుల క్రితం గ్రామసభ నిర్వహించి పంచాయతీ కార్యాలయంలో ఉంచిన జాబితాలో తమ పేర్లున్నాయని, ఇప్పుడెందుకు లేవని గ్రామస్తులు నిలదీశారు. రాత్రికి రాత్రే తమ పేర్లు తొలగించి అన్యాయం చేశారని మండిపడ్డారు.
మద్దూర్, కోస్గి మండలాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కోస్గి మండలం చంద్రవంచలో సభకు సీఎం వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండ లం తిర్మలాపూర్‌లో నాయకులకు అనుకూలం గా ఉన్న వారినే ఎంపిక చేసి పత్రాలిఇవ్వడం ఎంత వరకు సమంజసమని దేవరకద్ర ఎమ్మె ల్యే మధుసూదన్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. గ్రామానికి చెందిన లక్ష్మి తమ ఇంటికి తాగునీటి సౌకర్యం కూడా లేదని, రేషన్‌కార్డు, ఇల్లు లేదని అడుగుతున్న క్రమంలో గ్రామ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమె నేరుగా ఎమ్మెల్యేను అడగగా ‘నీకు ఏ పథకం ఇవ్వం’ అని కరాఖండిగా సమాధానమిచ్చినట్టు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థాన్‌నారాయణ పురం మండలం కోతులారంలో ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదని మండలం స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ కారును అడ్డుకున్నారు. ఓ మహిళ కంట తడి పెట్టి.. బోరున విలపించింది. ఆత్మకూరు (ఎం) మండలంలోని తిమ్మాపురంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొందరికే ప్రొసీడింగ్స్ ఇచ్చి వెళ్లిపోవడంతో పంచాయతీ కార్యాలయం ఎదట గ్రామస్తులు ధర్నా చేశారు. గుండాల మండలం బురుజుబావిలో తన పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో లేదని ఓ మహిళ బోరున విలపించింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం సభలో పథకాల మంజూరు పత్రాలను వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ పంపిణీ చేస్తుండగా ‘మా గ్రామానికి ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు అందలేదు’ అని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఎమ్మెల్యే దాటవేత సమాధానం చెప్తూ ‘గత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మట్టి పోయండి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీలో అశ్వారావుపే ట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. చాలామంది అర్హుల పేర్లు జాబితాలో లేవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మోహన్‌రావు.. పథకాలు రాని కొందరితో కలిసి సభ వద్దకు వెళ్లారు. అప్పటికే కార్యక్రమం ముగిసి ఎమ్మెల్యే వెళ్లిపోగా అధికారులు అక్కడే ఉన్నా రు. ఎంపీడీవో అశోక్ దగ్గరకు వెళ్లి అర్హులందరికీ పథకాలు ఎందుకు వర్తింపజేయడంలేదని అడుగగా కాంగ్రెస్ నాయకులు నాగభూషణం, బొర్రా సురేశ్, పొట్ట రాములు కలిసి మోహన్‌రావుపై దాడి చేశారు. జీసీసీ తాత్కాలిక ఉద్యోగి కొడెం రవి దాడిని అడ్డుకోగా కాంగ్రెస్ నాయకులు మరింత రెచ్చిపోయి ఇద్దరిపై తీవ్రంగా దాడిచేశారు. దీంతో కొడెం రవికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పంచాయతీ కార్యాలయం ఎదుట రవితో కలిసి ఆందోళన చేపట్టారు. ఎస్ఐ శివరామకృష్ణ చేరుకొని రవిని దవాఖానకు తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సముదాయించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. బాధితులను ఫోన్లో పరామర్శించారు.