Narsapur | మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 4, 5, 10, 11వ వార్డుల్లో పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగ్గా.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 15వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది.
ఇరు పార్టీల మధ్య కొట్లాట గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. దీన్ని బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది గమనించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.