కాగజ్‌నగర్, ఏప్రిల్ 7: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపల్ అధికారులు మంగళవారం సాయంత్రంగా ఆరు గంటల ప్రాంతంలో జేసీబీ ద్వారా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి మార్కింగ్ చేశారు. ఇటీవల తెలంగాణ తల్లి చౌరస్తాలోని రోడ్డుకు సమీపంలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుకు సంబంధించిన క్వార్టర్స్ ప్రహరీ కూల్చడం ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న పేపర్ మిల్లు జీఎం ఎంఎస్ గిరి ఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా, కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మిల్లుకు చెందిన సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుకైన రోడ్డుతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పేపర్ మిల్లుకు చెందిన వాహనాలు అధిక లోడ్‌తో వస్తుంటాయని, రోడ్డు దాటే పరిస్థితి లేదని, ఇరుకు రోడ్డుతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని వాదించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. రోడ్డు విస్తరణ పనుల్లో ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందులుపడ్డారు.