గుమ్మడిదల, ఫిబ్రవరి 15: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. శనివారం బాధిత గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. ప్రజలు, రైతులు, మహిళా సంఘాల వారు గుమ్మడిదలలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. రైతు జేఏసీ, మహిళా సంఘాలు ఎన్‌హెచ్‌పై ర్యాలీగా డంపింగ్ యార్డు ముట్టడికి వెళ్తుండగా మార్గమధ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహిళలను అడ్డుకోవడానికి మహిళా పోలీసులు లేకపోవడం గమనార్హం. గుమ్మడిదలలో 5వ రోజు రిలే దీక్షలో మైనార్టీలు కూర్చున్నారు. రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఆటోలతో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
గుమ్మడిదల నుంచి దోమడుగు వరకు ర్యాలీ నిర్వహించారు. నల్లవల్లిలో కొనసాగుతున్న 11వ రోజు రిలే దీక్షలో గ్రామ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. బొంతపల్లిలో రైతు జేఏసీ నాయకులు నాగేందర్‌గౌడ్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, సద్ది జయభాస్కర్రెడ్డి, రాజు, గ్యారల మల్లేశ్, సుంకరిశంకర్, సంజీవరెడ్డి, జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దులబండ్లపై గ్రామాల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్‌హెచ్‌పై టోల్‌ప్లాజా వరకు ప్రదర్శనగా వెళ్లారు. రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే పారిశ్రామిక కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాము డంపింగ్‌యార్డు వస్తే బతుకులు ఆగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిశ్రమల కాలుష్యం అక్కడ డంపింగ్‌యార్డు వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యంతో భూగర్భజలాలు కలుషితమై భూములున్నా పంటలు సాగుచేయలేని దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. 11 రోజులుగా నిరసనలు చేస్తున్నా సర్కారు మొద్దునిద్రలో ఉండటం సరికాదని హెచ్చరించారు. వెంటనే డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.