కాటారం, జూన్ 12: కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కాటారం మండలం మద్దులపల్లికి చెందిన రైతు గడ్డం చంద్రు (34) నాలుగేండ్లుగా గ్రామంలోని ఓ ఇద్దరి రైతులకు చెందిన 8 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. కాలం కలిసిరాక పంట దిగుబడి తగ్గడంతో రూ.10 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు.
చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ తరచూ భార్యకు చెప్పుకొని బాధపడేవాడు. ఈ క్రమంలో ఈనెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్సై తెలిపారు.