వర్ని, మే 17: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ శివారులో ఓ రైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిద్దాపూర్‌కు చెందిన బామన్ సాఖి (53) కూనిపూర్ శివారులో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నారుమడిని సిద్ధం చేయడానికి వెళ్లి బోరు మోటర్‌కు మరమ్మతు చేస్తుండగా విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సాయంత్రమైనా బామన్ సాఖి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య పోతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.