జగదేవ్‌పూర్, జూన్ 24 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగదేవ్‌పూర్‌కు చెందిన రాగుల నర్సింహులు (36) రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంటల సాగు, కుటుంబ పోషణకు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు.
దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చేమార్గం లేక కలత చెందాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన నర్సింహులు రాత్రి తొమ్మిది గంటలైనా రాకపోవడంతో భార్య లక్ష్మి కౌలుకు తీసుకున్న పొలం వద్ద కు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే గజ్వేల్‌లోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.