పెద్దకొత్తపల్లి, మార్చి 30 : మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మాలపూర్కు చెందిన కోనమోని శ్రీనివాసులు (55) కల్వకుర్తి మండలం వేపూరులో రూ.3.50 లక్షలు నగదు చెల్లించి 20 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. మామిడి తోటపై రూ.ఐదారు లక్షల వరకు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినా తోటకు పూత రాలేదు. దీంతో రూ.13 లక్షల దాక అప్పులు మీదపడ్డాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. శుక్రవారం తోటకు వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి రాకపోగా.. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆదివారం పక్క తోటను కౌలు తీసుకున్న రైతుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అతను తోటలోకి వెళ్లి చూడగా శ్రీనివాసులు మామిడి చెట్టుకు తన పంచెతోనే ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కన్పించాడు. వెంటనే సదరు రైతు శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కౌలు రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.