రామన్నపేట, మార్చి 10: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మోటె నరసింహ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నరసింహ గ్రామంలోనే పది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. దీనికోసం అప్పు చేశారు. పొలం ఎండిపోతుండటంతో సోమవారం ఉదయం మనస్థాపంతో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తిరుమలగిరి మండలంలో ఎండుతున్న పంటలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో సారు నీరులేక పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని మామిడాల గ్రామంలో బొడ్డు సైదులు అనే రైతు ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. అందులో నాలుగెకరాల వరి పంట పూర్తిగా ఎండిపోగా, మిగతా నాలుగు ఎకరాల పంట కాపాడుకునేందుకు రూ.2 లక్షలు వెచ్చించి మూడు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ కాల్వల్లో నిండుగా నీళ్లు రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు నిండుగా పోశాయి. కానీ ప్రస్తుతం కుంటలు, చెరువులు ఎండి పోవడంతో నిండుగా పోసే బోర్లు సైతం ఎండిపోయాయని రైతు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.