మునుగోడు, నవంబర్ 17: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేం ద్రానికి చెందిన పిట్టల సురేందర్(28) రెండేండ్ల నుంచి ఏడు ఎకరాల భూమిని కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈఎంఐలో ఆటో కొనుగోలు చేశాడు. ఆటో, పత్తి పంట సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి రాలేదు. ఆటో ఈఎంఐ కట్టడం భారమైంది. దీంతో మనస్తాపానికి గురైన సురేందర్ ఆదివారం రాత్రి కౌలు భూమి వద్ద పురుగలమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి పిట్టల బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.