కొత్తపల్లి/రామడుగు, మార్చి 17: సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. సాగులో దిగుబడులు రాక అప్పుల పాలయ్యాడు. ఇదే సమయంలో మనుమరాలి పెండ్లి కోసం తెచ్చిన బాకీలు పెరిగిపోయాయి. దీనికితోడు కొద్దిరోజుల క్రితం కెనాల్లో పడి తుంటి ఎముక విరగడంతో రూ.1.20 లక్షల అప్పు చేశాడు.
ఇటీవల మామిడితోట కౌలుకు తీసుకోగా దిగుబడి లేకపోవడంతో అప్పులు మరింత అధికమయ్యాయి. బాకీలు తీర్చే మార్గం లేకపోవడంతో జీవితంపై విరక్తిచెంది సోమవారం రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులో కౌలుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.