ఏటూరునాగారం, ఫిబ్రవరి 3: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొని వరి, మిర్చి సాగు చేయ గా, సరైన దిగుబడులు రాక నష్టపోయాడు. అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. పంటలు అమ్మగా వచ్చిన డబ్బులు పెట్టుబడికే సరిపోక మళ్లీ అప్పు చేశాడు.
రూ.4.5 లక్షల వరకు అప్పులు కావడం,ఆరోగ్యం బాగా లేకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సయ్య గత నెల 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అదేరోజు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.