నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 4: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ సమీపంలో మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన తల్లీకూతురు అనురాధ, మమతను కారు ఢీకొనడంతో మృతి చెందారు. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదిర్ (19) పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌కు స్నేహితులతో కలిసి బయలు దేరాడు. సన్‌సిటీ వద్దకు రాగానే కారు అదుపు తప్పి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద డీసీఎం వ్యాన్ మూడు బైక్‌లను ఢీకొట్టి, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రామచందర్ (52), వెంగళ సురేశ్‌చారి (45) మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచకు చెందిన ఆంజనేయులు (22), సంపత్ (19), అరవింద్ (19) ముగ్గురు ఒకే బైక్‌పై గన్నేరువరం మండలం గుండ్లపల్లికి వెళ్లి సోమవారం రాత్రి 10.30 గంటలకు తిరిగి రామంచకు వస్తున్నారు. కొత్తపల్లి మానేరు బ్రిడ్జి సమీపానికి చేరుకోగానే, ఓ ట్రాక్టర్ రాంగ్రూట్లో అతి వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నవీన్, భానుప్రసాద్, నారాయణ్‌రెడ్డి బైక్‌పై రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడం ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద ఎన్‌హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోగా.. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్లే రహదారిపై వన్‌వేలో వాహనాలను దారి మళ్లించారు. జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొట్టింది. టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. దాదాపు నాలుగు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.