హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండలు దంచికొట్టడం, ఉష్ణోగ్రతలు భారీ పెరగడంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. శనివారం రోజు హైదరాబాద్లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.4, రామగుండంలో 41.4, హనుమకొండలో 41, మహబూబ్నగర్లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో రాబోయే 48 గంటల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.