హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. అల్పపీడన వార్తలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు, కాంటా వేసిన బస్తాలు ఎక్కడివక్కడే ఉండటంతో రైతులు గుబులు చెం దుతున్నారు. కనీసం ధాన్యం రాశులను, బస్తాలను కప్పిపెట్టేందుకు టార్పాలిన్లను సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో ధాన్యం తడిసిముద్దవుతదేమోననే ఆందోళన రైతులను నిద్రపోనిస్తలేదు. కాగా, ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. వచ్చే మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నెల చివరి నాటికి ఎండల తీవ్రత మరింత పెరుగనున్నదని, అది 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయిని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా సాలూరాలో 44.1 డిగ్రీ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 43.4, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, సిద్దిపేట జిల్లా కోహెడ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించారు. వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని సూచించారు.