Summer | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 35 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం భద్రాచలం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 38.3 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా మంచిర్యాల జిల్లా ఖాసీపేటలో, ములుగు జిల్లా గోవిందరావుపేట, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 38.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి హీట్ వేవ్స్ వచ్చే అవకాశం లేదని, ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లో 33 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఉదయం సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. మార్చి 2 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.