హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత అధికం కావడంతో ప్రజలు వణికిపోతున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. తెల్లవారుజాము, సాయంత్రం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మరో రెండ్రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 10 డిగ్రీలోపు, 25 జిల్లాల్లో 14 డిగ్రీల్లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.