హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువ ఉండొచ్చని హెచ్చరించింది.
ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశమున్నదని వెల్లడించింది. పొడిగాలి, బలమైన ఈశాన్య గాలులు రాత్రిపూట చల్లదనాన్ని పెంచడమే ఉష్ణోగ్రతల తగ్గుదలకు కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలుగా నమోదైంది.