Weather Update | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమం గా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈ పాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణానికి మించి 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదు అవుతూ, వేసవి సీజన్‌ను తలపిస్తున్నది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా, ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో నైరుతి తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి రుతుపవనాలు పూర్తిస్థాయిలో తిరోగమించాయి. శుక్రవారం నల్లగొండ వరకు చేరినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో వాతావరణంలో మార్పు లు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదకావచ్చని పేర్కొన్న ది. రానున్న మూడు రోజులు రాష్ట్రం లో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.