Congress Govt | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం. సర్కారు బడుల్లో తెలుగు మీడియం బోధనకు ప్రభుత్వం స్వస్తి పలికేందుకు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టనున్నది. ఇందుకు తెలంగాణ విద్యాకమిషన్ వేగంగా కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషన్ టీచర్లు, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఇంగ్లిష్ మీడియంపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నది. నివేదికలోని అభిప్రాయాలను సాకుగా చూపి మాతృభాషకు ద్రోహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీంతో 1-10 తరగతుల వరకు విద్యార్థులు పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోనే చదువాల్సి ఉంటుంది.
2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. తొలుత 1-8 తరగతులకు అమలుచేసి, ఆ తర్వాత 9, 10 తరగతులకు విస్తరించారు. అయితే తెలుగుభాషకు ఇబ్బందుల్లేకుండా ద్విభాషా పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీచేశారు. విద్యార్థులు తెలుగులో లేదా ఇంగ్లిష్‌లో ఎలాగైనా పాఠాలు నేర్చుకునే అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను రెండు పార్ట్స్‌గా విభజించి తొలుత ఒక పార్ట్, ఆ తర్వాత రెండో పార్ట్ ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ విధానం గత మూడేండ్లుగా రాష్ట్రంలో అమలైంది.
ఇక నుంచి ద్విభాషా పుస్తకాలు ఉండవు. పూర్తిగా ఇంగ్లిష్‌లోనే ముద్రిస్తారు. ఇదే జరిగితే తెలుగును కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ఉపయుక్తంపై విద్యాశాఖ సర్వే నిర్వహిస్తున్నది. ప్రశ్నావళి ఆధారంగా టీచర్లు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఈ నెల 25లోపు సర్వే పూర్తిచేసి నివేదికను సమర్పించాలని డైట్ లెక్చరర్లను ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) ఫలితాల్లో వెనుకబడింది. విద్యార్థులకు చదవడం, రాయడం రావడంలేదని అనేక సర్వేలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో విద్యావ్యవస్థ మరింత కునారిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీచర్లతో నిర్వహించిన సమావేశంలో విద్యాకమిషన్ ఇదే అంశంపై అభిప్రాయసేకరణ జరుపగా, కొందరు భిన్నవాదనలు వినిపించారు.
రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానాన్ని(ఎన్ఈపీ) అమలుచేయాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఎన్ఈపీలో సూచించిన వాటిలో కొన్నింటిని రాష్ట్రంలో అమలుచేస్తున్నది. ఉన్నత విద్యలో ఎన్ఈపీని అమలుచేస్తామని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మాతృభాషలో విద్యాబోధన విషయంలో మాత్రం రాష్ట్రం ఎన్ఈపీకి విరుద్ధంగా నడుచుకుంటున్నది. మాతృభాషతోపాటు ప్రాంతీయభాషల్లో విద్యాబోధన జరుగాలని ఎన్ఈపీ సిఫారసు చేసింది. కానీ రాష్ట్రంలో మాతృభాషకు మంగళం పాడేందుకు సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి బోధన చట్టం అమల్లో ఉంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ పాఠశాల్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో ఆయా పాఠశాలల్లో తెలుగును బోధించకున్నా, తెలుగు ఉపాధ్యాయుడిని నియమించకున్నా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పాఠ్యపుస్తకాలను వినియోగించకపోయినా చట్టం ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఇక డిగ్రీ మూడో సంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరి చేసి అమలుచేస్తున్నారు.