సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:58

ఆస్ట్రేలియాలో ఇక తెలుగు పాఠాలు

ఆస్ట్రేలియాలో ఇక తెలుగు పాఠాలు

  • తెలుగు భాషకు ఎన్‌ఏఏటీఐ గుర్తింపు
  • ఎఫ్‌టీఏఏ శ్రీకృష్ణ పోరాటానికి దక్కిన ఫలితం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగువారి కల సాకారమైంది. తెలుగు భాషకు ఎన్‌ఏఏటీఐ (నేషనల్‌ అక్రెడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్స్‌లేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటర్స్‌) గుర్తింపు లభించింది. ఇక స్థానిక పాఠశాలల్లో ఆప్షనల్‌గా తెలుగుభాష నేర్చుకునే వీలు కలుగుతున్నది. తెలుగును కమ్యూనిటీ భాషగా గుర్తించాలని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఎఫ్‌టీఏఏ: ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఇన్‌ ఆస్ట్రేలియా) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ నడింపల్లి (ఓఏఎం-కాన్‌బెర్రా) స్థానిక తెలుగు సంఘాలతో కలిసి 2014లోనే అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలుగువారి జనాభా తక్కువగా ఉండటంతో అప్పట్లో ఆ విజ్ఞాపనను తిరస్కరించారు. తెలుగు మాట్లాడేవారంతా తమ మాతృభాషగా తెలుగును నమోదుచేయాలని విస్తృత ప్రచారం చేపట్టారు. దీంతో ఆ సంఖ్య భారీగా పెరిగింది. కమ్యూనిటీ భాషగా తెలుగుకు గుర్తింపు లభించింది. కొన్నేండ్లుగా ఎన్‌ఏఏటీఐతో ఎఫ్‌టీఏఏ సభ్యులు జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడేవారు 80 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక గణాంకాల్లో అందరూ తెలుగును మాతృభాషగా నమోదుచేసుకోవాలని అక్కడి తెలుగు ప్రతినిధులు మరోసారి పిలుపునిచ్చారు. అప్పుడే భావితరాలకు తెలుగు నేర్పడం సులువవుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల కృషి ఫలించిందని, ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవమని డాక్టర్‌ కృష్ణ నడింపల్లి, అడిలైడ్‌లో ఉంటున్న వరంగల్‌ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపురం వాసి ఆదిరెడ్డి యార సంతోషం వ్యక్తంచేశారు. తెలుగు భాషకు గుర్తింపు కోసం కృషిచేసినవారిలో శివశంకర్‌ పెద్దిబొట్ల (సిడ్నీ), మల్లికేశ్వర్‌రావు కొంచాడ (మెల్‌బోర్న్‌) ఉన్నారు. ఇప్పటివరకు హిందీ, పంజాబీ, తమిళం భాషలకు ఎన్‌ఏఏటీఐ గుర్తింపు ఉన్నది.


logo