Ponguleti Srinivasa Reddy | ఖమ్మం, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ద్వారా బీఆర్ఎస్ అధిష్ఠానానికి ప్రతిపాదనలు పంపించారు. తెల్లం వెంకట్రావ్ చేరికకు బీఆర్ఎస్ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయడంతో.. ఆయన గురువారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి హైదరాబాద్‌కు రానున్నారు. మంత్రులు కేటీఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్లో చేరనున్నారు. తెల్లంతోపాటు దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
తెల్లం వెంకట్రావ్ 2014లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ భద్రాచలం ని యోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని నెలలుగా పొంగులేటితో కలి సి రాజకీయ ప్రయాణం చేశారు.
కొంత కాలం క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. సీనియర్ నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తున్నది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న తాటి.. బీఆర్ఎస్లో చేరే విషయంపై అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సైతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది.