Redco Satish Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారమే పరమావధిగా పూర్తిగా దిగజారిపోయి నీచాతినీతంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయనకు అలవాటేనని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, రాష్ట్ర మంత్రులపై నోరు జారడం ఆయనకు నిత్యకృత్యంగా మారిందని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇన్ని రోజులు కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ఇప్పుడు మరింత దిగజారిపోయి చివరకు సొంత కుటుంబ గౌరవాన్ని బజార్లో నిలబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏకంగా మైనంపల్లి హన్మంతరావు అనే మరో నోటి దూల పిచ్చోడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అయ్యారని అన్నారు.
`మైనంపల్లి కేవలం మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేయలేదు. రెండు రోజులుగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడియోలో ఆయన ఏకంగా రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి తల్లిని గురించి నీచంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి కన్నతల్లిని మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టారు. మైనంపల్లి మాట్లాడిన తీరును, రేవంత్ రెడ్డి గారి తల్లి పై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తల్లిని పూజించే దేశంలో.. అదీ కూడా ఎమ్మెల్యే పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు` అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.
`తల్లిపై, మహిళలపై ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని నేరం. కానీ కళ్ళకు రాజకీయం అనే పొరలు కప్పుకున్న రేవంత్ రెడ్డి దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కన్నతల్లిని ఇష్టం వచ్చిన మాట్లాడిన వ్యక్తిని పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా అతడికి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి తన పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంతకంటే నీచమైన పని మరొకటి ఉండదు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న అధికార పార్టీ మీద అక్కసుతో కన్నతల్లి గౌరవాన్ని సైతం పణంగా పెట్టిన దుర్మార్గుడు, నీచుడు రేవంత్ రెడ్డి` అని వ్యాఖ్యానించారు.
`అపోజిషన్ పార్టీలు, ఆ పార్టీల నేతలు చేసే నీచ రాజకీయ విధానాల గురించి గతంలో అనేకసార్లు సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం అంటే ప్రజాసేవ. కానీ మిగతా పార్టీలకు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇది ఒక అక్రమ దందా లాంటిది. ఆ దందా కోసం కన్నతల్లి గౌరవాన్ని పణంగా పెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కన్న తల్లి అంటేనే పట్టింపు లేని వాడికి రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు అంటే పట్టింపు ఎలా ఉంటుంది.? అందుకే ఇలాంటి వ్యక్తులను ప్రజలు దగ్గరకు రానివ్వద్దు. రాష్ట్రం పొలిమేరల దాకా తరిమికొట్టాలి` అని సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.