తెలుగు యూనివర్సిటీ, జూలై 22: దేశంలో 22లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
కేంద్రం బాధ్యతారాహిత్యం వల్లే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పదవుల కంటే దేశం ముఖ్యమని గొప్పలు చెప్పుకొనే నేతలు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పారదర్శకంగా నిర్వహించలేని పరిస్థితులు ఉంటే నీట్ పరీక్ష బాధ్యతను రాష్ర్టాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలకు అండగా నిలుస్తామని తెలిపారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.